
వేసవి క్రీడల శిక్షణకు వేళాయె
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడల శిక్షణకు ముహూర్తం ఖరారు చేసింది. మే 1వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు అండర్ 14 విభాగంలో బాల,బాలికలకు అథ్లెటిక్స్‌తో పాటు వివిధ క్రీడాంశాలు వాలీబాల్, ఫుట్‌బాల్, మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, సాఫ్ట్ బాల్‌లో తర్పీదును ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 10 క్రీడా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
శిక్షణ కేంద్రాలివే..
జిల్లాలోని జనగామ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (చౌడారం/అథ్లెటిక్స్), వెంకిర్యాల ఉన్నత పాఠశాల (తైక్వాండో), స్టేషన్‌ఘన్‌పూర్ విద్యా జ్యోతి డిగ్రీ కళాశాల (ఫుట్‌బాల్), స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాక్సింగ్), పాలకుర్తి మండలం చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సాఫ్ట్ బాల్), గూడూరు ఉన్నత పాఠశాల (వాలీబాల్), లింగాలఘణపురం మండలం వనపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (వాలీబాల్), జఫర్‌గఢ్, చిల్పూరు మండలం తమ్మడపల్లి(జి), మల్కపూర్, నర్మెట మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలల్లో (మార్షల్ ఆర్ట్స్)ను నేర్పిచనున్నారు. ఉదయం 6.60 నుంచి 8.30 సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రోజుకు రెండు దఫాలుగా బాల, బాలికలకు క్రీడ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న బాల,బాలికలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎస్‌ఏటీజీఏఎస్‌ఈ. తెలంగాణ.జీఓవీ.ఇన్‌లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరి రోజు బాల,బాలికలకు సర్టిఫికెట్లను అందిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని 10 ప్రదేశాల్లో మే 1వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం శిక్షణ ఉంటుంది. వేసవిలో క్రీడల ద్వారా శారీరక ధృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడల్లో పాల్గొనాలి.
– బి.వెంకట్‌రెడ్డి,
జిల్లా యువజన, క్రీడల అధికారి
రేపటి నుంచి 10 పాఠశాలల్లో ప్రారంభం
అండర్–14 బాల,బాలికలకు అవకాశం