నేటి నుంచి ఉప్పల మల్లన్న జాతర
దేవరుప్పుల: నేటి నుంచి 19వ తేదీ వరకు మండల కేంద్రంలో ఉప్పల మల్లన్న జాతర జరగనుందని ఆలయ పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ మంగళవారం తెలిపారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే జాతరలో రోజువారీగా అభిషేకాలు, పద్మశాలీలచే శావ ఊరేగింపు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, శివపార్వతుల కల్యాణం, బండ్లు తిరుగుట, వాసవీ మాత ఆలయంలో అర్చనలు, దోపోత్సవము, అగ్నిగుండాలు, ఏకాంతసేవలు, వసంతోత్సవం, రుత్విక్ సన్మానంతో ముగయనుందన్నారు. పూర్వం మండల కేంద్రానికి ఓ ఉప్పు వ్యాపారి బస్తాలను వాగులో నుంచి ఎడ్లబండిపై తీసుకువస్తుండగా మార్గమధ్యలో ఆ బండి దిగబడింది. దీంతో బస్తాలు కిందికి దింపే క్రమంలో శివలింగం (దేవర) ఉప్పులో దొరికింది. దీంతో ఆ గ్రామానికి వేదబ్రహ్మణులు దేవరుప్పుల (దేవర +ఉప్పుల)గా నామకరణం చేసి ఊరుకు పడమర శివాలయాన్ని స్థాపించారని ఇక్కడి పూర్వికులు చెబుతుంటారు. ఆనాటి నుంచి ఏటా శ్రీ భ్రమరాంభ మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ సారి ప్రతిష్టాత్మతకంగా జరిగే జాతరలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్షిక కల్యాణ సహిత నూతన పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ, గణపతి, నంది విగ్రహాల పునఃప్రతిష్ఠాపనకు సిద్ధం చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.


