..అనే నేను!
● నేడే కొత్త సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం
● గ్రామాల్లో పండుగ వాతావరణం
● జిల్లాలో 280 సర్పంచ్‌లు.. 2,534 వార్డు సభ్యులు
జనగామ: జిల్లాలోని ఈనెల 22న(సోమవారం) గ్రామపంచాయతీల్లో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌ల పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం కోసం సర్వం సిద్ధం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాలను శుభ్రపరిచి, ప్రత్యేకంగా అలంకరించారు. పలు మండలాల్లో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, తదితర ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరై నూతన సర్పంచ్‌లు, పాలక మండళ్లకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.
శుభ మూహూర్తం చూసుకుని..
ఐదేళ్ల పరిపాలన బాధ్యతలు స్వీకరించేందుకు కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు చూసుకుని తమ ఛాంబర్‌లలో అడుగుపెట్టనున్నారు. జిల్లాలోని 280 మంది సర్పంచ్, ఉప సర్పంచ్, 2,534 మంది వార్డు సభ్యులచే పంచాయతీ కార్యర్శులు ప్రమాణ స్వీకారం చేయించి, మొదటి సంతకాలు తీసుకుంటారు. ప్రమాణ స్వీకార వేడుకలకు పార్టీ శ్రేణులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. అత్యధిక ఓటర్లున్న ప్రధాన పంచాయతీలతో పాటు చిన్న గ్రామాల్లో హడావిడి నెలకొంది. పంచాయతీ భవనాలకు రంగులు వేసి పండుగ వాతావరణంగా మార్చేశారు. సర్పంచ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, మొక్కలు నాటడం, పంచాయతీ రికార్డుల పునర్వ్యవస్థీకరణ, శుభ్రత పనులపై మొట్టమొదటగా ఫోకస్ సారించనున్నారు.
పోలీసుల బందోబస్తు..
ప్రజాస్వామ్య విలువలను కాపాడే క్రమంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా సర్వం సిద్ధం చేసింది. ప్రమాణ స్వీకార వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
..అనే నేను!


