ప్రియమైన గ్రామ ప్రజలకు..
ఏడాదిన్నర కాలంగా నన్ను చూసి చాలా మందికి బాధ కలిగింది. ఎందుకంటే నేను మీ గ్రామపంచాయతీని. నా పాలక మండలి పదవీ కాలం ముగిశాక, కొత్త ఎన్నికలు జరగకపోవడంతో నేను అనాథగా మిగిలిపోయాను. నన్ను చూసి మీరు ఏమన్నారో, ఎలా తిట్టారో ఇంకా నా కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఎక్కడ తప్పు చేశానో అర్థం చేసుకోవడానికి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపా. నా కార్యాలయానికి వచ్చిన ప్రతివారు పొరపాట్లను ఎత్తి చూపించారు. ప్రతి మాట నా హృదయంలో గుచ్చుకుంది. ఎలక్షన్లు లేకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నిధులు రాలేదు. నేనేం చేసేది. కానీ ఇప్పుడు నాకు మళ్లీ ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది. ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త పాలకులు ఎన్నికయ్యారు. నా భవనంలో ఖాళీగా కనిపించిన కుర్చీల్లో మరికొద్దిసేపట్లో ప్రజాప్రతినిధులు కూర్చోబోతున్నారు. మీ సమస్యలకు నేరుగా స్పందించే నాయకత్వం వస్తోంది. నా గుండెలపై ఉన్న బరువు దిగిపోనుంది. ఇక వీధిలైట్లు అంతటా వెలుగుతాయి.. రోడ్లు శుభ్రపడతాయి. డ్రైనేజీలు క్లీన్ చేస్తారు. సీసీ రోడ్ల నిర్మాణం తిరిగి మొదలవుతాయి. సరిపడా నిధులు వస్తే. అభివృద్ధి కోసం మీరు ఆశించే రోజులు మొదలుకానున్నాయి.
ఇట్లు
మీ గ్రామపంచాయతీ
– జనగామ


