పెండింగ్‌లో ప్రజావాణి దరఖాస్తులు కలెక్టరేట్‌లో 350, మండలాల్లో 82 పెండింగ్ రెవెన్యూ అర్జీలే ఎక్కువ.. కోర్టు కేసులు.. వివాదాలతో జాప్యం మండలాల గ్రీవెన్స్‌కు ప్రచారం కరువు నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
జనగామ: పెద్ద సార్‌ను కలిసి తమ సమస్యను మొరపెట్టుకుంటే ఆ సమస్య ఇట్టే పరిష్కారమైపోతుందనే నమ్మకం కొందరిది. అధికారిని కలిసి వినతి చేసుకున్నా... నెలల తరబడి పరిష్కారానికి నోచుకోక అమ్మో అంటూ నీరసించిన వారు ఎందరో. ప్రజల సమస్యలకు దారి చూపించేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌తో పాటు మండలాల పరిధిలోని తహసీల్దార్, విద్యుత్ శాఖ కార్యాలయాల్లో గ్రీవెన్స్ (దరఖాస్తుల స్వీకరణ) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు.. వాటి పరిష్కారం ఎలా ఉందనే దానిపై సాక్షి ప్రత్యేక కథనం.
రెవెన్యూ దరఖాస్తులే ఎక్కువ
జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్‌సింగ్, ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, జెడ్పీ సీఈఓ, అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషాతో గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. ప్రతివారం జరిగే గ్రీవెన్స్‌కు 60 నుంచి 70 దరఖాస్తుల వరకు రాగా.. ఇందులో 45కు పైగా రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉండడం గమనార్హం. కోర్టు కేసులు, భూ వివాదాలు, గెట్టు పంచాయితీ, కాస్తులో పేరు ఉండి.. పట్టా బుక్కు రాకపోవడం ఇలా అనేక సమస్యలతో గ్రీవెన్స్‌కు వస్తుంటారు. చిన్న చిన్న పంచాయితీలను తెగదెంపు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నించినా.. ఎదుటి వ్యక్తులు ససేమిరా అనడంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులే ఎక్కువగా ఉంటున్నాయి. గతేడాది ఆగస్టు నుంచి మార్చి వరకు 1,089 దరఖాస్తులు గ్రీవెన్స్ రాగా, ఇందులో 646 పరిష్కరించారు. 350 పెండింగ్‌లో ఉండగా, 73 అండర్ ఎంక్వరీలో ఉన్నాయి. ఈ మొత్తంలో 80 వరకు రెవెన్యూ అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రచారం లేని మండల గ్రీవెన్స్
గ్రీవెన్స్ దరఖాస్తులపై అధికారులు మరింత ఫోకస్ సారించాలి. తహసీల్దార్ కార్యాలయాల్లో పరిష్కారానికి నోచుకునే సమస్యలు సైతం కలెక్టరేట్ మెట్లు ఎక్కుతున్నాయి. తహసీల్ కార్యాలయంలో గ్రీవెన్స్ జరుగుతున్నా... పెద్దగా ప్రచారం లేకపోవడంతో చాలామంది శ్రమకు ఓర్చి కలెక్టరేట్‌కు వస్తున్నారు. రెవెన్యూ సంబంధింత సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తుండగా.. మండలాలకు రెఫర్ చేసిన అర్జీల్లో కొన్నింటికి మోక్షం కలగడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. రేషన్ కార్డులు, సదరం సర్టిఫికెట్, ఇందిరమ్మ ఇల్లు, పంట రుణ మాఫీ, రైతు భరోసా, జనగామ పట్టణంలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై వచ్చే అర్జీల్లో చాలా వరకు బుట్టదాఖలై పోతున్నాయనే బహిరంగ చర్చ వినిపిస్తుంది. మండలాల వారీగా జరిగే గ్రీవెన్స్‌కు విస్తృత ప్రచారం కల్పించి, ప్రతి దరఖాస్తుకు పరిష్కారం లభిస్తుందనే భరోసా కల్పిస్తే కలెక్టరేట్ వరకు ప్రదక్షిణ చేసే బాధ, కష్టం తప్పుతుంది. గడిచిన ఆరు నెలల కాలంలో నర్మెట తహసీల్దార్‌కు రెండు మాత్రమే దరఖాస్తులు రావడం గమనార్హం. అలాగే లింగాలఘణపురం, రఘునాథపల్లి, పాలకుర్తి, తరిగొప్పులలో దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువ.
మండలాల వారీగా గ్రీవెన్స్ వివరాలు
మండలం దరఖాస్తులు పెండింగ్
నర్మెట 02 –
స్టేషన్‌ఘన్‌పూర్ 357 11
కొడకండ్ల 268 03
చిల్పూరు 300 02
జనగామ రూరల్ 127 03
జఫర్‌గఢ్ 393 03
పాలకుర్తి 25 03
బచ్చన్నపేట 135 15
తరిగొప్పుల 16 03
రఘునాథపల్లి 29 01
లింగాఘణపురం 30 05
దేవరుప్పుల 84 33
మొత్తం 1,766 82
శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులు
2024 సంవత్సరం ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలోని వివిధ శాఖల వారీగా 646 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఏడీ మైనింగ్, జిల్లా పరిశ్రమలు, జిల్లా ఇంటర్మీడియట్ విద్య, మార్కెటింగ్ అధికారి, ఆర్‌అండ్‌బీ, జిల్లా రవాణా అధికారి, ఈఓ పీఆర్‌డీ, మత్స్య శాఖ, ఫారెస్ట్ ఆఫీసర్, మైనార్టీ సంక్షేమ అధికారి, ఎకై ్సజ్ శాఖ, గిరిజన సంక్షేమం, జెడ్‌పీ సీఈఓ శాఖలకు ఒక్కొక్కటి, బీసీ సంక్షేమం, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, జిల్లా ఆస్పత్రి, జిల్లా విద్యా అధికారి, విద్యుత్ ఎస్‌ఈ, భూగర్భ జల శాఖ, చేనేత శాఖ, మిషన్ భగీరథ శాఖలకు రెండేసి, పశుసంవర్ధక, జిల్లా పౌర సరఫరా, జిల్లా కోఆపరేటివ్, న్యాయ సహాయ మండలి శాఖలకు మూడు చొప్పున, ఏడీ సర్వే 4, జిల్లా వ్యవసాయాధికారి 7, జిల్లా పంచాయతీ అధికారి 11, జిల్లా గ్రామీణాభివృద్ధి 5, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి 6, నీటిపారుదల శాఖ 18, వైద్య ఆరోగ్య అధికారి 4, మెప్మా 24, జనగామ మున్సిపాలిటీ 70, ఎంపీడీఓలు 17, పీడీ హౌసింగ్ 6, పీడీ మహిళా శిశు సంక్షేమం 5, పోలీసు శాఖ 34, ఆదాయం శాఖలో 98 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.