జనగామ రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం చేశారు. ఈ నెల 21 (శుక్రవారం) నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు కలిపి 6,238 మంది ఉండగా వారికి 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో మాదిరిగా ఏడు పేపర్లు పరీక్ష రాయాల్సి ఉండగా ప్రత్యేకంగా సైన్స్‌లో రెండు పేపర్లు పార్ట్ 1 బయోలాజికల్ సైన్స్, పార్ట్ 2 ఫిజికల్ సైన్స్ ఉన్నాయి. 24 పేజీల బుక్‌లెట్ పద్ధతిన పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30గంటల వరకు పరీక్ష జరగనుంది. ఐదు నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులను అనుమతించనున్నారు.
మొత్తం 6,238 మంది విద్యార్థులు..
జిల్లాలో 180 పాఠశాలల నుంచి మొత్తం 6,238మంది పరీక్షకు హాజరు కానుండగా వారిలో 2,996 బాలురు, 3,242 బాలికలు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లకు ప్రశ్న పత్రాలు చేరుకోగా బార్‌కోడింగ్ పద్ధతిలో పరీక్షలు ఉన్నందున ముందుగా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాల్సి ఉంది. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. అలాగే వైద్యసిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు.
అధికారుల నియామకం
పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు, సిబ్బందిని కలెక్టర్ నియమించారు. మొత్తం 41 మంది కస్టోడియన్ అధికారులు, 41 డిపార్ట్‌మెంట్ అధికారులు, ఒకరు అదనపు డిపార్ట్‌మెంట్ అధికారి, 3 రూట్ అధికారులు, 380 మంది ఇన్విజిలెటర్స్, 2 ప్లయింగ్ స్క్వాడ్‌లు, హైపర్ కమిటీ కూడా పర్యవేక్షిస్తుంది.
అన్ని ఏర్పాట్లు చేశాం
రేపటి నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. గతంలో నిమిషం నిబంధన అమలులో ఉండగా ఈసారి ఐదు నిమిషాలు ఆలస్యమైన అనుమతించాలని ప్రభుత్వ నిర్ధేశించింది. సెంటర్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాం. ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలి.
– రమేశ్, డీఈఓ
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
హాజరుకానున్న 6,238 మంది విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా
41 పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు
ఏడు పేపర్లకు బుక్ లెట్ పద్ధతిన పరీక్షల నిర్వహణ
పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం