
మాట్లాడుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ఎంజీఎం: దేశంలో ఎక్కడా లేని విధంగా వరంగల్ నగరంలో 24 అంతస్తుల్లో 2వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఆయనకు.. నిర్మాణం జరుగుతున్న తీరు.. సివిల్ పనులు.. ప్రణాళిక తదితర విషయాలను ఎల్‌అండ్‌టీ ప్రతిని ధులు మ్యాప్ ద్వారా వివరించడంతో పాటు స్వయంగా చూపించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదలకు కార్పొరేటర్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. 42 ఎకరాల స్థలంలో 24 అంతస్తుల్లో 2 వేల పడకల కోసం రూ.1,200కోట్లు ఖర్చు చేసి ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మాణ పనులు చేపట్టిందని, ఇప్పటికే 60 శాతం మెయిన్ బిల్డింగ్ స్ట్రక్చర్ పనులు పూర్తయినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లోగా ఆస్పత్రికి అవసరమైన అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నా రు. ఆస్పత్రి అందుబాటులోకి వస్తే జనగామ, హనుమకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు హైదరాబాద్ తరహాలో కార్పొరేట్ వైద్యం ఇక్కడే లభిస్తుందని చెప్పారు. ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రభుత్వ రంగంలో చేపట్టడం ఆషామాషీ కాదని, దేశంలో చాలా అరుదుగా ఇలాంటి ఆస్పత్రుల నిర్మాణం జరుగుతుందని అన్నారు. పనులు మొదలు పెట్టిన రోజు నుంచి 24 గంటలపాటు వేగంగా నడుస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స, ఆర్డీఓ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
24 అంతస్తుల్లో
2వేల పడకలతో నిర్మాణం
సెప్టెంబర్‌లోగా ఆస్పత్రి పనులు పూర్తి..
డిసెంబర్‌లో అందుబాటులోకి..
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి