
ఆలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి
లింగాలఘణపురం: సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యస్థలం జీడికల్ ఆలయానికి పూర్వవైభవం తేవడానికి సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల పరిధి జీడికల్‌లోని శ్రీ వీరాచల సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని సోమవారం జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్‌ఆర్) నిధులు రూ.4కోట్లతో చేపట్టి న అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ పరిశీలించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోపాటు రాము డి పేరుతో పబ్బంగడుపుకునే బీజేపీ ఏనాడు ఆలయాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఆలయాలకు పూర్వవైభవం తీసుకు వస్తున్నారని చెప్పారు. వల్మిడి ఆలయ అభివృద్ధికి సీడీఎఫ్ నుంచి మరో రూ.50 లక్షలు కేటాయించామని, జూలై మొదటి వారం నాటికి పనులను పూర్తి చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. వచ్చే మూడేళ్ల కాలంలో ఆలయ రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, వైస్ ఎంపీపీ కిరణ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు గణపతి, సర్పంచ్‌లు శ్రీపాల్‌రెడ్డి, పరకాల రాజు, నాయకులు నాగేందర్, సురేందర్ రెడ్డి, భాగ్యలక్ష్మి, మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.4కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి
సీడీఎఫ్ నుంచి రూ.50లక్షలు మంజూరు
జూలై మొదటి వారం కల్లా
పనులు పూర్తి చేయండి
సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ ‘పోచంపల్లి’