కోరుట్లరూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్‌పెల్లి గ్రామానికి చెందిన కొండ్ర రాజేశ్ (36) 20 రోజుల క్రితం దుబాయ్‌లో మృతిచెందగా శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజేశ్ పదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. ఇక్కడే సోరియాసిస్ వ్యాధి సోకింది. వ్యాధి నివారణ కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు 3 నెలల క్రితం మళ్లీ దుబాయ్ వెళ్లాడు. అక్కడ వ్యాధి మరింత వ్యాప్తి చెంది శరీరంలోని అన్ని భాగాలకు విస్తరించగా దుబాయ్‌లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత ఎక్కువై 20 రోజుల క్రితం మృతిచెందాడు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.


