మానకొండూర్: తన తల్లి అస్థికలు కాశీలోని గంగా నదిలో కలిపేందుకు మానకొండూర్‌కు చెందిన రామోజు శ్రీనివాస్(55) కుటుంబ సభ్యులతో కలిసి రైలులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో గురువారం రాత్రి మృతిచెందాడు. శ్రీనివాస్ కుల వృతి(గోల్డ్ వర్క్) చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన తల్లి మణెమ్మె 3 నెలల క్రితం చనిపోగా.. ఆమె అస్థికలు కాశీలోని గంగా నదిలో కలిపేందుకు గురువారం ఉదయం రైలులో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బయలు దేరారు. మార్గమధ్యలో మహారాష్ట్ర సేవాగ్రామ్ వద్ద శ్రీనివాస్ తాగునీరు కోసం గురువారం రాత్రి రైలు దిగాడు. అదే సమయంలో అటుగా వస్తున్న రైలు ఢీకొనడంతో శ్రీనివాస్ ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఈ ప్రమాదం జరగడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.


