జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయరంగంలో మహిళా రైతుల పాత్ర అమోఘమని వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్‌కుమార్‌శర్మ అన్నారు. ఆదివారం జగిత్యాలరూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో మహిళా రైతు కిసాన్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగురంగం ఎప్పటికప్పుడు కొంత పుంతలు తొక్కుతుందని, ఆ మేరకు మహిళా రైతులు ముందుకు రావాలన్నారు. ప్రస్తుతం సాగులో సంప్రదాయకతకు పెద్దపీట వేస్తూ ఆధునిక సాంకేతిక పద్ధతులను ఆచరించాలని సూచించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నీరజ మాట్లాడుతూ, వ్యవసాయంలో వస్తున్న నూతన పోకడలను మహిళా రైతులు పసిగట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలపై డాక్టర్ సరిత, పుట్టగొడుగుల పెంపకంపై డాక్టర్ ఎల్లాగౌడ్, వరి విత్తనోత్పత్తిపై డాక్టర్ మధుకర్, కూరగాయల పెంపకంపై డాక్టర్ స్వాతి రైతులకు వివరించారు. అలాగే, విద్యార్థినులు పలు రకాల విత్తనాలను ప్రదర్శనగా ఉంచారు. పలు పంటలపై శాస్త్రవేత్తలు రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కోరుట్ల ఏడీఏ రమేశ్, రైతులు పాల్గొన్నారు.


