కొడిమ్యాల: మండల కేంద్రం, ధమ్మాయిపేట, నాచుపల్లి గ్రామంలో కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నాచుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు. వంట గది పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించిన తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదోతరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రణాళిక ఏర్పర్చుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రం, ధమ్మాయిపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులు, గ్రామ పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్ర భవనం తదితర అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్, జిల్లా హౌసింగ్ అధికారి ప్రసాద్, డీఈవో రాము, ఎమ్మార్వో కిరణ్‌కుమార్, ఎంపీడీవో స్వరూపరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


