ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో వరి ధాన్యం కమీషన్ డబ్బులపై వివాదం నెలకొంది. సర్పంచ్ మేడిశెట్టి పద్మ, ఉపసర్పంచ్ గొట్టే శ్రీకాంత్ సమక్షంలో గురువారం ఏర్పాటు చేసిన గ్రామసభలో రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తుల మధ్య కమీషన్ డబ్బులపై వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామంలో పదేళ్లుగా రైతుల నుంచి ధాన్యం సేకరించగా వచ్చిన కమీషన్ లెక్కలు చెప్పాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. పదేళ్లుగా కమీషన్ డబ్బుల వివరాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక పంటకు రూ.3.30లక్షల చొప్పున కమీషన్ వచ్చిందని, 20 పంటల కమీషన్ డబ్బుల లెక్కలు తేల్చాల్సి ఉందన్నారు. దాదాపు రూ.66లక్షల కమీషన్ డబ్బులను సీఏలే సొంతంగా వాడుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇదే సమయంలో మహిళా సంఘాల సభ్యులు కూడా తమ వాదనను వినిపించడంతో సమావేశం వేడెక్కింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ మేడిశెట్టి పద్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు కొందరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.
పదేళ్ల లెక్కలు చెప్పాలంటూ గ్రామస్తుల డిమాండ్
సీఏలే సొంతంగా వాడుకున్నారని ఆరోపణలు


