పెగడపల్లి: కలకాలం కలిసి ఉంటామని బాస చేసిన ఆ దంపతులు మరణంలోనూ కలిసేపోయారు. ఈ విషాద ఘటన పెగడపల్లి మండలం మద్దులపల్లిలో విషాదం నింపింది. బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సురకంటి చుక్కారెడ్డి, శంకరమ్మ భార్యాభర్తలు. వీరిది వ్యవసాయ కుటుంబం. కుమారుడు, కూతురు సంతానం. వృద్ధాప్యం దరిచేరడంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చుక్కారెడ్డి బుధవారం రాత్రి సమయంలో మృతిచెందాడు. ఆయన మృతిని తట్టుకోలేని శంకరమ్మ కూడా గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. దంపతులిద్దరూ ఒకేరోజు మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. గురువారం ఒకేసారి ఇద్దరికి అంత్యక్రియలు పూర్తి చేశారు. వీరి కుమారుడు సురకంటి సత్తిరెడ్డి ప్రస్తుతం పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. విషయం తెలుసుకున్న పలు గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఒకేరోజు భార్యాభర్తల మృతి
మద్దులపల్లిలో విషాదం


