బీజేపీలో ముదిరిన లొల్లి | - | Sakshi
Sakshi News home page

బీజేపీలో ముదిరిన లొల్లి

Mar 6 2026 9:06 AM | Updated on Mar 6 2026 9:06 AM

● ఎంపీ పర్యటన నేపథ్యంలో గొడవ ● ఫర్నిచర్‌ ధ్వంసం, గ్రీన్‌మ్యాట్ల చించివేత ● అదుపులోకి తీసుకున్న పోలీసులు ● పదిమందిపై కేసు నమోదు

● ఎంపీ పర్యటన నేపథ్యంలో గొడవ ● ఫర్నిచర్‌ ధ్వంసం, గ్రీన్‌మ్యాట్ల చించివేత ● అదుపులోకి తీసుకున్న పోలీసులు ● పదిమందిపై కేసు నమోదు

జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీలో వర్గపోరు ముదురుతోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన బోగ శ్రావణి.. మరోవర్గానికి కొన్నిరోజులుగా పడటం లేదు. ప్రతి విషయంలో శ్రావణి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని మరోవర్గం వారు గొడవకు దిగుతున్నారు. ఎంపీ అర్వింద్‌ వర్గానికి చెందిన శ్రావణి పార్టీలో సీనియర్లను విస్మరిస్తున్నారని, కొత్తవారికి పెద్దపీట వేస్తున్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు, సీనియర్లకు టికెట్లు ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారని ఇటీవల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ రెబల్స్‌గా బరిలో నిలిచి గెలిచారు. వారిని పార్టీ సస్పెండ్‌ చేసింది. గురువారం ఎంపీ అర్వింద్‌ జిల్లాకు వస్తున్నారన్న సమాచారంతో సీనియర్‌ నేతలు బోగ శ్రావణి ఇంటి వద్ద హల్‌చల్‌ చేశారు. అక్కడున్న కుర్చీలు, మ్యాట్లు ధ్వంసం చేశారు. శ్రావణి భర్త ప్రవీణ్‌ను దుర్భాషలాడారు. విషయం తెలుసుకున్న సీఐ కరుణాకర్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఎమ్మెల్యే ఎన్నికల నుంచే..

జగిత్యాల బల్దియాలో బీఆర్‌ఎస్‌ తరఫున చైర్మన్‌గా కొనసాగిన బోగ శ్రావణిని బీజేపీలోకి తీసుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించారు. ఆమె 40వేలకు పైగా ఓట్లు సాధించినా ఓడిపోయారు. తన ఓటమికి కారణం కొందరంటూ అప్పుడే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. త్రీమెన్‌ కమిటీ వేయగా.. వారు కూడా కొందరు సీనియర్లు శ్రావణికి కాకుండా వేరేవారికి మద్దతు ఇచ్చినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి గొడవ ముదురుతూ వస్తోంది.

దాడి సరికాదు..

తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని, మహిళ అని కూడా చూడకుండా తనపై దాడిచేశారని శ్రావణి అన్నారు. ఎంపీ పర్యటన నేపథ్యంలో సీనియర్‌ నాయకులమని చెప్పుకుంటూ సస్పెండ్‌ అయిన కొందరు తన ఇంటిపై దాడి చేశారని, తన భర్త ప్రవీణ్‌ను చంపేస్తామని, అంతు చూస్తామని దుర్భాషలాడారని పేర్కొన్నారు. సీఐ సంఘటన స్థలానికి చేరుకుని గొడవ లేకుండా చూశారని, ఆందోళన చేసిన వారిపై కలెక్టర్‌, ఎస్పీలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

బోగ శ్రావణి ఇంటి వద్ద గొడవ చేస్తున్న

బీజేపీ రెబల్స్‌

అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

నేను వచ్చాక దాడి చేస్తే నా అంగరక్షకులే కాల్చిపారేసేవారు: ఎంపీ అర్వింద్‌

జగిత్యాలటౌన్‌: కోవర్టు రాజకీయాలు తనకు కొత్త కాదని, ఇవి తన ముందు నడవవని, కోవర్టులను ఇప్పటికే బయటకు పంపించామని, ఎవరైనా ఉంటే ఏరిపారేస్తామని ఎంపీ అర్వింద్‌ అన్నారు. శ్రావణి నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. పార్టీని బలోపేతం చేస్తున్న శ్రావణి కోవర్టులకు శత్రువులా కనిపిస్తున్నారని, అందుకే దాడులకు పాల్పడుతున్నారని, తాను వచ్చాక అటాక్‌ చేసి ఉంటే తన అంగరక్షకుడే కాల్చిపారేసేవాడని పేర్కొన్నారు. సస్పెండ్‌ అయిన వారి గురించి ఆరేళ్ల తర్వాత ఆలోచిస్తామన్నారు. రాజకీయాలు మానుకుని కేంద్రీయ విద్యాలయానికి చల్‌గల్‌లో పదెకరాల స్థలం కేటాయించాలన్నారు. రాబోయే రోజుల్లో జగిత్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

10 మందిపై కేసు నమోదు

జగిత్యాలక్రైం: బోగ శ్రావణి ఇంటి వద్ద హంగామా సృష్టించిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఎంపీ అర్వింద్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. బీజేపీ రెబల్స్‌ సీపెల్లి రవీందర్‌, సిరికొండ శ్రీనివాస్‌, సుధాకర్‌, ప్రజోత్‌, కమలాకర్‌, ప్రమోద్‌, కిశోర్‌సింగ్‌, సతీశ్‌, మరికొంత మంది ఆందోళన చేశారు. వారిపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement