● హెచ్‌ఎంపై కలెక్టర్ ఆగ్రహం
మెట్‌పల్లి: ‘విద్యార్థుల చదువు ఇదేనా.. ఏం బోధిస్తున్నారు..? ఏం చేస్తున్నారు..’ అని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్‌పల్లి పట్టణంలోని చావిడి వద్ద ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించారు. తొమ్మిదో తరగతిలోకి వెళ్లి ఓ విద్యార్థిని చదవాలని కోరాగా.. సరిగా చదవలేకపోయాడు. దీంతో ప్రధానోపాధ్యాయురాలిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీసం చదవడం, రాయడం వంటి నైపుణ్యం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. నెలరోజుల్లో మరోమారు పాఠశాలకు వస్తానని, ఆ లోపు విద్యార్థుల పరిస్థితి మెరుగుపడకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
నాణ్యమైన భోజనం అందించాలి
అనంతరం కలెక్టర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించారు. పరిశుభ్రతను పాటించడంతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. సౌకర్యాలు, సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వద్దు
అనంతరం కలెక్టర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. పన్నుల వసూళ్లపై తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్తి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
మెట్‌పల్లిరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ అన్నారు. మెట్‌పల్లి మండలం వెల్లులలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు ఉండాలని సూచించారు. అధికారులు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. హౌసింగ్ పీడీ ప్రసాద్, ఎంపీడీవో సురేశ్, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు.


