తగ్గుతున్న భూగర్భజలాలు | - | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న భూగర్భజలాలు

Mar 4 2026 7:46 AM | Updated on Mar 4 2026 7:46 AM

● పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ● ఫిబ్రవరిలోనే 4.49మీటర్ల దిగువకు

జగిత్యాలఅగ్రికల్చర్‌: ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో.. జిల్లాలో భూగర్భజలాలు లోతుకు పడిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే 0.29 మీటర్ల దిగువకు చేరింది. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏప్రిల్‌, మేలో మరింత లోతుకు పడిపోనున్నాయి. తద్వారా తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా పట్టణాల్లో ఎగువ ప్రాంతాల్లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు మున్సిపాలిటీలు సిద్ధమయ్యాయి.

బల్దియాల్లో పెరుగుతున్న నీటి వినియోగం

జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో నీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాకేంద్రంలో జనవరిలో 4.61 మీటర్ల లోతులో జలాలు ఉండగా.. ప్రస్తుతం 2.72 మీటర్లకు పడిపోయాయి. ఫిబ్రవరిలో అది 7.33 మీటర్లకు చేరుకుంది. కోరుట్లలో గత నెల 7.28 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం.. 1.11 మీటర్లకు పడిపోయి ప్రస్తుతం 8.39 మీటర్లకు చేరుకుంది. మెట్‌పల్లిలో గతనెల 5.29 మీటర్ల లోతులో భూగర్భజలం ఉండగా.. 0.7 మీటర్లు పడిపోయి 5.99 మీటర్లకు చేరుకుంది. ధర్మపురిలో గతనెల 4.35 మీటర్ల లోతులో భూగర్భజలం ఉండగా.. ప్రస్తుతం 0.47 మీటర్లు పడిపోయి 4.82 మీటర్లకు చేరుకుంది. ఇటీవల వర్షాలు కురవడంతో రాయికల్‌ మున్సిపాలిటీలో మాత్రం గతనెల 2.92 మీటర్ల లోతులోనే భూగర్బజలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం 2.83 మీటర్ల లోతులో జలాలు ఉన్నాయి.

నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో అంతంతే

జిల్లాలో నాన్‌ఆయకట్టు ప్రాంతాలైన మల్యాల, మేడిపల్లి, కథలాపూర్‌, కొడిమ్యాల, మెట్‌పల్లి ప్రాంతాల్లో భూగర్భజలాలు మరింతగా పడిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో పంటలకు సాగునీటిని ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో భూగర్భజలాలు తగ్గుతున్నాయి. మల్యాల మండలంలో గత నెల 5.07 మీటర్ల లోతులో నీరు ఉండగా.. 0.98మీటర్ల లోతుకు పడిపోయి ప్రస్తుతం 6.05 మీటర్ల దిగువన నీరు ఉంది. కొడిమ్యాలలో గతనెలలో 7.83 మీటర్లు ఉంటే.. 1.8 మీటర్లకు పడిపోయింది. వరదకాలువలో నీరు ప్రవహిస్తుండటంతో కథలాపూర్‌లో 1.93 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ప్రస్తుతం 0.27 మీటర్లు పెరిగింది. మేడిపల్లిలో 3.68 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టం 0.41 మీటర్లు పెరిగి 4.09 మీటర్లకు చేరుకుంది.

ఒక్క నెలలోనే పడిపోయిన నీటి మట్టం

జిల్లాలో ఒక్క నెలలోనే నీటి మట్టం సగటున 0.29 మీటర్లకు పడిపోయింది. జనవరిలో 4.20 మీటర్ల లోతులో ఉండగా.. ఫిబ్రవరి చివరినాటికి 0.29 మీటర్లకు తగ్గింది. గతేడాదితో పోల్చితే 0.37 మీటర్లు తగ్గింది.

ఆయకట్టు మండలాల్లోనూ అదే స్థాయిలో

జిల్లాలో ఆయకట్టు మండలాల్లో ఫిబ్రవరి చివరివరకు నమోదైన భూగర్భజలాలను పరిశీలిస్తే.. బీర్‌పూర్‌లో 1.82 మీటర్లు, బుగ్గారంలో 5.42 మీ, ఎండపల్లిలో 6.50 మీ, గొల్లపల్లిలో 3.05 మీ, జగిత్యాలరూరల్‌లో 2.51 మీ, పెగడపల్లిలో 4.65 మీ, సారంగాపూర్‌లో 5.43 మీ, వెల్గటూర్‌లో 2.65 మీ, ఇబ్రహీంపట్నంలో 4.63 మీ, మల్లాపూర్‌లో 4.86 మీ, భీమారంలో 3.40 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement