రాయికల్: రాయికల్ బల్దియాను అందరి సహకారంతో అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్‌గా కట్కం రవి, వైస్ చైర్‌పర్సన్‌గా తురగ సౌజన్య, పాలకమండలి సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీతోపాటు జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు విభిన్న తీర్పు ఇచ్చారని, పాలకవర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు ఉన్నారని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎంపీ ధర్మపురి అర్వింద్ సహకారం తీసుకుంటామన్నారు. వసంత మాట్లాడుతూ.. రాయికల్ వంటి మేజర్ గ్రామపంచాయతీని బల్దియాగా గుర్తించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
వసతులపై ప్రత్యేక దృష్టి
మున్సిపాలిటీలో వసతుల కల్పన దిశగా దృష్టి సారిస్తానని చైర్మన్ కట్కం రవి అన్నారు. పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాల నిర్వహణ వంటి వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. వివిధ పార్టీలు, యువజన సంఘ సభ్యులు పాలకవర్గాన్ని సన్మానించారు. కమిషనర్ కీర్తి నాగరాజు, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, కౌన్సిలర్లు తోపారపు ప్రశాంతి, రాకేశ్‌నాయక్, తురగ సౌజన్య, కూనారపు మానస, వేముల మౌనిక, ఎలిగేటి లితక, పల్లికొండ గంగాధర్, బత్తిని మహేశ్వరి, మచ్చ గంగలక్ష్మీ, పుర్రె శ్రీధర్, కల్లెడ ధర్మపురి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


