పాలిషింగ్‌తోనే పసుపునకు ధర | - | Sakshi
Sakshi News home page

పాలిషింగ్‌తోనే పసుపునకు ధర

Mar 2 2026 8:18 AM | Updated on Mar 2 2026 8:18 AM

పాలిష

పాలిషింగ్‌తోనే పసుపునకు ధర

జగిత్యాలఅగ్రికల్చర్‌: పసుపు అత్యధికంగా సాగు చేసే జగిత్యాల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌, మేడిపల్లి ప్రాంతాల నుంచి పసుపు అమ్మేందుకు నిజామాబాద్‌, మహారాష్ట్రలోని సాంగ్లీ, జిల్లాలోని మెట్‌పల్లి మార్కెట్లకు తీసుకెళ్తుంటారు. బహిరంగ మార్కెట్‌లో పసుపు క్వింటాల్‌కు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు పలుకుతున్నప్పటికీ.. జిల్లా రైతులకు మాత్రం రూ.10వేల నుంచి రూ.11 వేలకు మించి రావడం లేదు. దీనికి ప్రధాన కారణం పసుపులో సరైన నాణ్యత లేకపోవడమేనని తెలుస్తోంది. అధిక బరువు వస్తుందనే కారణంతో తేమ ఉన్న పసుపును మార్కెట్‌కు తరలిస్తుండడం.. కొనుగోలుదారులకు ఇంపుగా ఉండేలా పాలిషింగ్‌ చేయకపోవడంతో ధర తక్కువ పలుకుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

నాణ్యతలో రాజీ వద్దు..

పసుపులో ప్రధానంగా కుర్కుమిన్‌ శాతాన్ని బట్టి వ్యాపారులు రేటు నిర్ణయిస్తుంటారు. రంగుల, ఔషధ పరిశ్రమల్లో కుర్కుమిన్‌ ప్రధాన భూమిక పోషిస్తుంది. గట్టిగా ఉన్న పసుపు కొమ్మును కట్‌ చేసి.. అందులోని పదార్థాన్ని పరిశీలించి రేటు పెడుతుంటారు. పసుపు కొమ్ములు ప్రకాశవంతంగా కనబడటంతోపాటు నారింజ నుంచి ముదురు నారింజ రంగు ఉంటే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కొనుగోలు చేసిన పసుపులో తేమ ఉంటే బూజు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఏ మాత్రం తేమ లేకుంటేనే అధిక ధర నిర్ణయిస్తారు. పసుపునకు దేశీయంగా పోల్చితే.. అంతర్జాతీయంగా పెద్ద మార్కెటింగ్‌ వ్యవస్థ ఉండటంతో చాలామంది వ్యాపారులు ఆయా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పసుపును పంపించాల్సి ఉంటుంది.

ఆధునిక యంత్రాలతో..

పసుపు పంట కాలం సుమారు 8 నుంచి 9 నెలలు. పంట పండించడం ఒక ఎత్తైతే.. తర్వాత చేసే పనులు మరో ఎత్తు. పంట తవ్వడం, కొమ్ములు విరవడం, పసుపు గడ్డలకు ఉన్న వేర్లు తొలగించడం, పసుపు ఉడుకబెట్టడం, ఆరబెట్టడం, పాలిషింగ్‌ చేయడం, మార్కెట్‌కు తరలించడం వంటి పనులు ఓపికతో చేస్తేనే మార్కెట్‌లో అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పసుపు రైతులు ఆధునిక యంత్రాలను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యాన మిషన్‌ ద్వారా పసుపును ఉడుకబెట్టేందుకు.. పాలిషింగ్‌ చేసేందుకు సబ్సిడీపై ఆధునిక యంత్రాలు ఇస్తున్నారు. జిల్లాలోని మేడిపల్లి, మల్లాపూర్‌ తదితర మండలాల్లో పసుపును భోజ పద్ధతిలో ట్రాక్టర్‌ ద్వారానే వేస్తుండటం, ట్రాక్టర్‌ ద్వారానే తవ్వడం చేస్తున్నారు. కొన్ని మండలాల్లో సంప్రదాయ పద్ధతిలో పసుపును ఇనుప చువ్వలతో తవ్వడం ద్వారా కొమ్మలు విరిగిపోవడం, ఉడకబెట్టినప్పుడు మరి చిన్నగా అవడంతో మార్కెట్‌లో ధర రావడం లేదు. పసుపును ఉడుకబెట్టేందుకు కూడా ఆవిరి యంత్రం వచ్చింది. ఇది పసుపు నాణ్యతను దెబ్బతినకుండా చేస్తోంది.

పాలిషింగ్‌పైనే ప్రధాన దృష్టి

రైతులు 9 నుంచి10 నెలలు కష్టపడి పంట పండించి.. చివరి దశ అయిన పసుపును ఉడుకబెట్టి కొంచెం పచ్చిగా ఉండగానే ఎటువంటి పాలిషింగ్‌ చేయకనే మార్కెట్‌కు తరలించి భారీగా నష్టపోతున్నారు. పాలిషింగ్‌ చేసేందుకు కూడా ఆధునిక యంత్రం రావడం రైతులకు పెద్ద సమస్య కాదు. కాని ఉడకబెట్టిన పసుపు కనీసం 10 రోజులు ఎండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు కురుస్తుండడంతో మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు తక్కువ రేటుకు రైతుల నుంచి కొనుగోలు చేసి, కూలీలతో ఆరబెట్టించి, పాలిషింగ్‌ చేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు.

నాణ్యత పెంచేందుకు ఆధునిక యంత్రాలు

మార్కెట్‌కు చేర్చే వరకూ రైతులకు పోరాటమే

పాలిషింగ్‌తోనే పసుపునకు ధర1
1/1

పాలిషింగ్‌తోనే పసుపునకు ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement