అమృత్ 2.0 ఆలస్యం
జగిత్యాల: రానున్నది వేసవికాలం. ఎండలు ముదిరే అవకాశం ఉంది. కనీసం ఈ వేసవిలోనైనా అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న తాగునీటికి సంబంధించిన పనులు పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదు. మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 కింద మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేశాయి. ఈ పథకం కింద వాటర్ ట్యాంక్‌లు, వాటర్ సంప్, పైప్‌లైన్‌లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 2024 జూన్‌లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఏడాదిలోపే పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. వర్క్ ప్రోగ్రెస్ పూర్తిస్థాయిలో ఎక్కడా కాలేదు. జగిత్యాలలో ధర్మసముద్రం వద్ద ఒక వాటర్ సంప్, 1500 కిలోలీటర్ల ట్యాంక్ నిర్మిస్తున్నారు. సంప్ 70 శాతం పూర్తి కాగా.. వాటర్ ట్యాంక్ పనులు 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఎస్‌కేఎన్‌ఆర్ (ప్రభుత్వ) కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న ట్యాంక్ పనులు 40 శాతం కూడా పూర్తి కాలేదు. కొత్తబస్టాండ్ ఆవరణలో నిర్మిస్తున్న ట్యాంక్ ఇంకా 5శాతం పనులు చేయాల్సి ఉంది. పైప్‌లైన్లు పూర్తయినప్పటికీ ట్యాంక్‌ల నిర్మాణాల్లోనే జాప్యం జరుగుతోంది. కోరుట్లలో యెఖిన్‌పూర్‌లో నిర్మిస్తున్న ట్యాంక్ 80శాతం పూర్తి కాగా.. ఇంకా 20శాతం పూర్తి కావాల్సి ఉంది. పైప్‌లైన్ పూర్తిస్థాయిలో కాగా.. హౌస్ కనెక్షన్స్ ఇవ్వలేదు. మెట్‌పల్లిలో ఆరపేట విలేజ్‌లో చేపట్టాల్సిన పనులు అండర్ ప్రాసెస్‌లోనే ఉన్నాయి. రాయికల్‌లో నిర్మిస్తున్న వాటర్ సంప్, ట్యాంక్‌కు సంబంధించి ప్రభుత్వ భూమి లేకపోవడంతో ప్రైవేటు భూమిని గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ భూ సమస్యతో ఆగిపోయింది. అలాగే ధర్మపురిలో ట్యాంక్‌ల నిర్మాణంలో ఇంకా 15 శాతం వరకు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం?
అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న పనుల్లో కాంట్రాక్టర్ల అలసత్వం కనిపిస్తోంది. కొన్ని చోట్ల కాంట్రాక్ట్‌లు పొందినప్పటికీ పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా పనులు ముందుకెళ్లడం లేదు. పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మున్సిపాలిటీల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలోని బల్దియాలకు విడుదలైన నిధులు
బల్దియా నిధులు (రూ.కోట్లలో)
జగిత్యాల 38.06
కోరుట్ల 41.05
మెట్‌పల్లి 19.04
ధర్మపురి 23
రాయికల్ 15.02
పెరుగుతున్న పట్టణాలు
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి అతిపెద్ద మున్సిపాలిటీలు. ఈ బల్దియాల్లో జనాభా ఏటేటా పెరిగిపోతోంది. ప్రతి కాలనీకి నీరు అందించాలన్న ఉద్దేశంతో జనాభాకు సరిపడా ట్యాంక్‌లు ఏర్పాటు చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ పనులు జరగడంలో ఆలస్యం జరుగుతున్నాయి.
వేగంగా జరిగేలా చర్యలు
అమృత్ 2.0 పనుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొన్నిచోట్ల స్థల సమస్యతో ఇబ్బందిగా ఉండేది. పనులు నెమ్మదించిన విషయం వాస్తవమే. వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అలసత్వం ప్రదర్శించిన కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశాం.
– సంపత్‌రావు, పబ్లిక్ హెల్త్ ఈఈ


