ఆశ.. నిరాశేనా
కోరుట్ల: మావో కీలక నేత లొంగుబాటుతో తమ వారి ఆచూకీ దొరుకుతుందన్న ఆశల్లో ఉన్న కుటుంబాలు తీవ్ర నిరాశకు గురవుతున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన తమవాళ్లు పోలీసు రికార్డుల్లో లేరన్న విషయం ఇప్పటికే స్పష్టం కాగా.. కనీసం అజ్ఞాత మావోయిస్టుల్లో ఎక్కడో ఓ చోట ఉండి ఉంటారన్న ఆశలు ఉండేవి. వారంక్రితం మావోయిస్టు కీలక నేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయిన క్రమంలో కోరుట్లకు చెందిన బెజ్జారపు కిషన్, నిజాముద్దీన్ ఆచూకీ వెల్లడి కాలేదు. అసలు వీరిద్దరు ఎక్కడ ఉన్నారన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది.
తిరుపతి సమకాలీకులే..
కోరుట్లలో తిప్పిరి తిరుపతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న సమయంలో నిజాముద్దీన్ క్లాస్‌మేట్. వీరికి బెజ్జారపు కిషన్ రెండేళ్లు సీనియర్. కోరుట్ల జూనియర్ కళాశాలలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాల్లో తిరుపతి, నిజాముద్దీన్‌తోపాటు కిషన్ కూడా పాలుపంచుకునేవాడని సమాచారం. కిషన్ జగిత్యాలలో రాజ్‌దూత్ వంటి వాహనాల మెకానిక్‌గా పనిచేసేవాడు. జగిత్యాల జైత్రయాత్ర సమయంలో వీరంతా కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే కాకుండా.. వాల్‌రైటింగ్స్ రాసేవారని సమాచారం. అంతే కాకుండా 1984–88 మధ్య కాలంలో ఈ ముగ్గురు పోలీసు నిర్భంధం ఫలితంగా ఒకటి రెండేళ్ల కాలంలోనే ఒక్కొక్కరుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతకాలం పాటు వీరంతా ఒకే ఏరియాల్లో పనిచేసి కాలక్రమేణా వేర్వేరు ప్రాంతాల్లోని మావోయస్టు దళాలుగా విడిపోయినట్లు ప్రచారం జరిగింది. నిజాముద్దీన్, బెజ్జారపు కిషన్ మావోయిస్టు టెక్ విభాగంలో పనిచేసినట్లు కొంతకాలం ప్రచారం జరిగింది. ఆ తరువాత కాలంలో వీరి జాడలేకుండా పోయింది. కొన్నాళ్లపాటు పోలీసులు వీరి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి కిషన్, నిజాముద్దీన్‌ను లొంగిపోవాలని కోరారు. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసు రికార్డుల్లో లేకపోవడం గమనార్హం.
ఆశలు అడియాసలు..
ఇటీవల తెలంగాణ డీజీపీ మావోయిస్టుల జాబితా ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో పోలీసు రికార్డుల్లో కిషన్, నిజాముద్దీన్ లేరన్న విషయంలో మరింత స్పష్టత వచ్చింది. ఇక మావోయస్టుల నుంచి తమవారి సమాచారం వస్తుందన్న ఆశలు మిగిలి ఉండేవి. మావోయస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి లొంగిపోతున్నాడన్న సమాచారంతో ఆయన సహచరులు కిషన్, నిజాముద్దీన్ సమాచారం ఆయన వద్ద ఎంతో కొంత ఉంటుందని కుటుంబాలు ఎంతో ఆశపడ్డాయి. తిరుపతి లొంగుబాటు అనంతరం ఎలాంటి సమాచారమూ లేకపోవడంతో కిషన్, నిజాముద్దీన్ కుటుంబాలు నిరాశలో మునిగిపోయా యి. ఏళ్ల తరబడి ఎదురుచూపులతో కాలం గడిపినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ తమవారు ఉన్నారా..? లేరా..? అనే విషయంలో జవాబుదారీ ఎవరు అనే ఆందోళనలో కిషన్, నిజాముద్దీన్ కుటుంబాలు కలత చెందుతున్నాయి.
ఇంకా తెలియని బెజ్జారపు కిషన్, నిజాముద్దీన్ ఆచూకీ
తిప్పిరి తిరుపతి లొంగిపోయినా లభించని జాడ
వారి కుటుంబాల్లో అంతులేని ఆవేదన
ఆశ.. నిరాశేనా


