ఎత్తుకు పైఎత్తు.. అనైతిక పొత్తు
కోరుట్ల: మున్సిపాలిటీల్లో చైర్మన్‌గిరీని తమ ఖాతాలో వేసుకోవాలన్న ఆత్రుతలో రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు, ఆశయాలు వదిలి అనైతిక పొత్తులకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో.. రెండింట్లో ఈ వైఖరి తేటతెల్లమైంది. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి నేరుగా చైర్మన్‌గిరీని దక్కించుకునే స్థాయిలో కౌన్సిలర్ స్థానాలు రాగా.. మెట్‌పల్లి, రాయికల్‌లో మాత్రం హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలు సిద్ధాంతాలు విస్మరించి అడ్డగోలు పొత్తులకు తెరలేపాయి.
పార్టీల అంతర్మథనం
మెట్‌పల్లి, రాయికల్ మున్సిపాటీల్లో హంగ్ పరిస్థితుల్లో పార్టీలు తరతమ బేధాలు వదిలేసి పొత్తులకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ క్రాస్ ఓటింగ్ వెనక పార్టీ పెద్దల ప్రమేయం ఉందా..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాయికల్‌లో మాత్రం మున్సిపల్ చైర్మన్ పీఠం విషయంలో మాత్రం ఫ్రెండ్లీ కాంటెస్ట్‌కు అద్దం పట్టినట్లు కనిపించింది. ఈ రెండు మున్సిపాలిటీల్లో ఈ రీతిలో జరగడంలో పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో పార్టీ కీలక వర్గాలు అంతర్మథనంలో పడినట్లు సమాచారం. హంగ్ పరిస్థితుల్లో చేసేదేమీ లేక పార్టీలు తమ సిద్దాంతాలు, ఆశయాలు పక్కనబెట్టి పట్టు వదిలేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
అడ్డగోలు పొత్తులు..
మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ 10, బీఆర్‌ఎస్ 6 కాంగ్రెస్ 6, స్వతంత్రులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికకు ఒకరోజు ముందు బీజేపీ నుంచి విప్ జారీ చేయడంలో పొరపాటు జరిగిందా..? లేక కావాలనే చేశారా..? అనే విషయంలో స్పష్టత లేదు. చైర్‌పర్సన్ ఓటింగ్ రోజు ఆరుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నలుగురు స్వతంత్రుల మద్దతుతోపాటు విప్ జారీలో పొరపాటుతో బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్ క్రాస్ ఓటింగ్ చేశారు. ఫలితంగా మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం 11మంది కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్‌కు దక్కింది. ఈ పొరపాటు కావాలనే చేశారని, కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని అనుమానించిన బీజేపీ నుంచి చైర్‌పర్సన్ రేసులో ఉన్న ఓ కౌన్సిలర్ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిపై గొడవకు దిగడం గమనార్హం. రాయికల్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉండగా.. బీఆర్‌ఎస్ 3, కాంగ్రెస్ 3, బీజేపీ 5, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. హంగ్ పరిస్థితులు ఉండటంతో ఇక్కడా చైర్మన్ ఎన్నికకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరిగింది. ఫలితంగా 3 స్థానాలు ఉన్న బీఆర్‌ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.


