కుల బహిష్కరణ ఘటనపై విచారణ
జగిత్యాలరూరల్: బీర్‌పూర్ మండలం కందెనకుంటలో ఇటీవల కుల బహిష్కరణ జరిగిందన్న ఘటన అబద్ధమని జిల్లా సామాజిక సమరసత వేదిక నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆకుతోట వెంకటరాంరెడ్డి ఆధ్వర్యంలో సభ్యుల బృందం గ్రామంలో నిజనిజాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరాంరెడ్డి మాట్లాడుతూ, సంఘటనకు కారణమని చెబుతున్న సర్పంచ్ కొమిరె నర్సయ్య, మృతుడు ఎదుల రాజేశం కుటుంబ సభ్యులను కలిసి విచారించామన్నారు. మృతుడు రాజేశం, సర్పంచ్ దగ్గరి బంధువులేనని వివరించారు. మృతుడికి మేనమామ వరస అయ్యే కొమిరె పోచయ్యకు గ్రామంలో కొంత వివాదం నెలకొందని పేర్కొన్నారు. వివాదాల నేపథ్యంలో రాజేశం చనిపోయిన సమయంలో మృతదేహాన్ని దహనసంస్కారాలకు తాను ఒక్కడినే తీసుకు వెళ్తానని పోచయ్య చెప్పాడని తెలిపారు. ఈ విషయమై గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుల బహిష్కరణ చేసినట్లు వైరల్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్, గౌరవ అధ్యక్షుడు లచ్చన్న సంతోష్ పాల్గొన్నారు.


