అగ్గి తెగులు.. తేరుకుంటేనే తొలుగు
కరీంనగర్ అర్బన్: అగ్గి తెగులు అన్నదాతల్లో గుబులు రేపుతోంది. యాసంగిలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగే ఎక్కువ. 2.80లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా 2.50లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ప్రతి సీజన్‌లో ఏదో తెగులు ఆందోళనకు గురి చేస్తుండగా తాజాగా నీడలా వెంటాడుతోంది. జిల్లావ్యాప్తంగా సదరు తెగులు ఇప్పుడిప్పుడే విస్తరిస్తుండగా పలు ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఅర్డినేటర్ డా.బోగారి హరికృష్ణ వివరించారు.
లక్షణాలు ఇవీ
వరిలో ఈ తెగులు ఏ దశలో అయినా ఆశిస్తుంది. వరి ఆకుల మీద వెన్ను మెడ భాగాల మీద ఆకులపై, నూలికండే ఆకారం కలిగిన గోధుమ రంగు అంచులు గల మచ్చలు ఏర్పడతాయి. మచ్చల మధ్యలో బూడిద రంగు ఉంటుంది. పిలకల కనుపుల వద్ద ఆశిస్తే ఆ ప్రదేశం వద్ద పిలక విరిగి వాలిపోతుంది. తెగులు సోకిన వెన్ను మెడ దగ్గర నల్లటి మచ్చలు ఏర్పడి వెన్ను విరిగి వేలాడుతూ కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఎక్కువ గింజలు తాలు గింజలుగా మారుతాయి.
ఎందుకిలా..
ఈ తెగులుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులుంటే అంతే మరి. ఒక వారం రోజులపాటు రాత్రి ఉష్ణోగ్రత 18–22 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 90%, మంచు లేదా వర్షపు జల్లులు కారణం. నవంబర్ నుండి ఫిబ్రవరి మాసంలో ఈ పరిస్థితులు ఉన్నప్పుడు, నత్రజని మోతాదు ఎక్కువైనప్పుడు ఈ తెగులు త్వరగా అభివృద్ధి చెంది ఎక్కువ నష్టం కలగజేస్తుంది.
నివారణ ఇలా
అగ్గి తెగులును తొలి దశలో నివారించడానికి ఐసోప్రోతయోలిన్ 1.5 మిల్లీలీటర్, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, టేబుకొనజల్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకుని పిచికారి చేసుకోవాలని హరికృష్ణ వివరించారు.
సస్యరక్షణ చర్యలతోనే అడ్డుకట్ట
వరిలో విస్తరిస్తున్న తెగులు


