సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రామగుండం: శీతాకాలంతోపాటు సంక్రాంతి పండుగ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. హైదారాబాద్–గోరఖ్‌పూర్(07075) మధ్య ఈనెల 16, జనవరి 23వ తేదీల్లో నడుస్తుంది. గోరఖ్‌పూర్–హైదరాబాద్(07076) మధ్య ఈనెల 18, జనవరి 25వ తేదీ నడుస్తుంది. మచిలీపట్నం–అజ్మీర్(07274) ఈనెల 21న ఉదయం పదిగంటలకు బయలు దేరుతుంది. అదేరైలు తిరుగు ప్రయాణం(07275)లో అజ్మీర్–మచిలీపట్నం ఈనెల 28న ఉదయం 8.25 గంటలకు అజ్మీర్‌లో ప్రారంభమవుతుంది.
రోడ్డుపై పడి వ్యక్తి మృతి
సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడుకు చెందిన ఏస పర్శరాములు(55) గురువారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. పర్శరాములు గత ఆరు నెలలుగా సిరిసిల్లలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. రాత్రి 10 గంటలకు పని ముగించుకొని నడుచుకుంటూ రగుడు వెళ్తుండగా చంద్రంపేట చౌరస్తా వద్ద రోడ్డు పక్కన ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. మృతునికి భార్య వనజ, కుమారులు సాయిదీప్, శ్రీనివాస్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పొలంలో పడి రైతు..
రామడుగు: రామడుగు మండలంలోని వెదిర గ్రామానికి చెందిన శనిగరపు అంతయ్య(65) గుండెపోటుతో వ్యవసాయ పొలంలో పడి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం అంతయ్య శుక్రవారం ఉదయం పొలంలో పనులు చేస్తుండగా గుండెపోటుకు గురై పొలంలో పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్‌కు తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు.
గీత కార్మికుడు..
రామడుగు: రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన మల్లారపు శంకరయ్య(70) అనే గీతకార్మికుడు గుండెపోటుతో చనిపోయాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం కల్లు గీసేందుకు వెళ్లి ఇంటి వచ్చాడు. కాసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
పత్తిమిల్లులో అగ్ని ప్రమాదం
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని సుద్దాల గ్రామంలోని పత్తిమిల్లులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ శివారులోని మిల్లులో అగ్ని ప్రమాదం ఏర్పడింది. మిల్లులో పనిచేస్తున్న కార్మికులు, హమాలీలు సిలిండర్ల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వేములవాడలోని ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో వాహనం వచ్చి మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చింది. మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన పత్తి నిల్వలు ఉన్నాయి. ఎలాంటి నష్టం జరగకపోవడంతో యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు


