మొక్క నాటి సంరక్షించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ కళాశాలలో చేరిన ప్రతీ విద్యార్థి మొక్క నాటడంతో పాటు నాలుగేళ్ల పాటు సంరక్షించాలని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ భారతీనారాయణ్ భట్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో శుక్రవారం గ్రీన్ గ్రాడ్యుయేషన్ సెర్మని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ మాట్లాడుతూ, వ్యవసాయ వర్శిటీ నిబంధనల మేరకు కళాశాలలో మొదటి ఏడాదిలో చేరిన ప్రతీ విద్యార్థి ఒక్క మొక్క నాటాల్సి ఉంటుందని చెప్పారు. ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సమాజంలో అవగాహన కల్పించాలని సూచించారు. చైర్‌పర్సన్ డాక్టర్ వేణుగోపాల్, సభ్యులు డాక్టర్ సత్యనారాయణరెడ్డి, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ అరుణ్‌కుమార్, డాక్టర్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
అటవీశాఖ సర్వేపై ఆలయ అధికారుల అభ్యంతరం
మల్యాల(చొప్పదండి): కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో శుక్రవారం అటవీశాఖ ఆధ్వర్యంలో సర్వే చేసేందుకు రాగా, ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొండగట్టు ఆలయాన్ని ఆనుకొని అటవీశాఖ భూములు ఉండడంతో కొంతకాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సర్వే చేపట్టేందుకు రాగా, అటవీ శాఖ భూములకు సంబంధించిన పత్రాలు చూపించాలని, ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సర్వే అధికారులు వెనుదిరిగారు.


