పల్లెల్లో సందడి
జగిత్యాల:పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు కావడం.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామీణప్రాంతాల్లో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. రెండేళ్లుగా పల్లెల్లో పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధిపై ప్రభావం పడింది. ఏదైనా సమస్య వస్తే ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామంలో బల్బుపోయినా.. డ్రైనేజీలు తీయాలన్నా అందరికీ ఇబ్బందిగా ఉండేది. స్పెషల్ ఆఫీసర్లకు ఇన్‌చార్జి ఇవ్వడంతో సమస్యలు సక్రమంగా పరిష్కరించలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ రావడం.. నామినేషన్లు స్వీకరించనున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఇవే ముచ్చట్లు విన్పిస్తున్నాయి. ఎవరు పోటీ చేస్తున్నారు..? మహిళల రిజర్వేషన్లలో ఎవరిని నిలబెడుతున్నారన్న అంశంపై చర్చిస్తున్నారు. పార్టీలను పక్కన పెట్టి వ్యక్తిగత పలుకుబడితో పాటు, గ్రామంలో చేసిన సేవలను గుర్తించాలని కొందరు వ్యక్తులు పోటీ చేసేందుకు ముందుకెళ్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీల పరంగా జరగవు కాబట్టి వ్యక్తిగత చరిష్మా ఉన్న వారే గెలుపొందే అవకాశాలుంటాయి.
అభ్యర్థుల కోసం పార్టీల అన్వేషణ
పల్లెల్లో రాజకీయ సంగ్రామం మొదలైన నేపథ్యంలో పార్టీల నేతలు బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్టీలో బలంగా ఉన్నవారిని నిలబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలపై కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించే దిశగా ప్రయత్నిస్తుండగా.. బీఆర్‌ఎస్, బీజేపీ సీట్లు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలు పార్టీలగుర్తుపై జరగకపోయినప్పటికీ కార్యకర్తలను కాపాడుకోవాలని కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇందిరా మహిళాశక్తి చీరలు, వడ్డీలేని రుణాలు ప్రకటించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ.. ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఏ విధంగానైనా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను గెలుపించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. కుల, మహిళాసంఘాలు, యువతను ఇప్పటి నుంచే ఆకట్టుకునేలా ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి. మొదటి విడతలో జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆశావహులకు పెద్దగా సమయం లేనప్పటికీ, రెండు, మూడో విడతల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాత్రం ప్రణాళిక రూపొందించుకునేందుకు చాలా సమయం ఉంది. ఆ దిశగా ముందుకెళ్తున్నారు.


