రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కరీంనగర్‌క్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. కరీంనగర్ హుస్సేనిపురకు చెందిన మహ్మద్ అమీర్‌ఖాన్ (18) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. బుధవారం రాత్రి షాపు మూసివేసి కార్ఖానాగడ్డకు రాగా, వెనకనుండి గుర్తు తెలియని వ్యక్తి వ్యాన్‌తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మోర్తాడ్: మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారు పెద్దవాగుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన పేర్ల కృష్ణ (44) తన స్నేహితుడు కోట సమ్మయ్యతో కలిసి ఆర్మూర్‌కు వెళుతుండగా వంతెనపై ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కృష్ణను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తిమృతి
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్–ఓదెల రైల్వేస్టేషన్ల మధ్యలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి(35), గుర్తు తెలియని రైలు నుంచి కిందపడి మృతిచెందినట్లు రామగుండం జీఆర్ఫీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. బ్లూ కలర్ టీషర్ట్, స్కై బ్లూకలర్ ప్యాంటు ధరించిన మృతుడి వద్ద చంద్రాపూర్ నుంచి తిరుపతికి వెళ్తున్నట్లు టిక్కెట్ ఉంది. ఇంకా ఎలాంటి ఆధారాలు, గుర్తింపు కార్డులు లేవు. మృతదేహాన్ని రామగుండం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. వివరాలకు 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని జీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లికి చెందిన బాలె మల్లీశ్వరి (38) గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. మల్లీశ్వరి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. వైద్యులకు చూపించినా నయం కాలేదు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుంది. ఆమె భర్త గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


