ర్యాగింగ్‌తో భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: కళాశాల విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని, ర్యాగింగ్‌తో భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు ర్యాగింగ్, డ్రగ్స్, మత్తు పదార్థాలపై వాటిల్లే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. స్నేహపూర్వక వాతావరణంలో చదువుకోవాలని, సీనియర్లు జూనియర్లను ప్రోత్సహించి మార్గనిర్దేశం చేయాలన్నారు. ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు, జైలుశిక్ష, కళాశాల నుంచి బహిష్కరణ, స్కాలర్‌షిప్ రద్దు, భవిష్యత్‌లో ఉద్యోగాలు కోల్పోవడం వంటి తీవ్ర శిక్షలు ఉంటాయన్నారు. ర్యాగింగ్ బాధితులు డయల్ 100కుగానీ, సమీప పోలీస్‌స్టేషన్‌కు గానీ సమాచారం అందించాలన్నారు. అనంతరం యాంటీర్యాగింగ్ పోస్టర్ ఆవిష్కరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ రఘుచందర్, టౌన్ సీఐ కరుణాకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సునిల్‌కుమార్, హెచ్‌వోడీ ఖాద్రి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


