నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
కొడిమ్యాల(చొప్పదండి): కొడిమ్యాల మండలకేంద్రంలోని శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్ తగిలి 11 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. అప్పటివరకు ఉత్సవాల్లో కోలా టం ఆడిన ఆ చిన్నారి.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిందన్న విషయం స్థానికులను కలచివేసింది. కొడిమ్యాలకు చెందిన తిప్పరవేణి నాగరాజు, మమత దంపతుల పెద్ద కూతురు మధుశ్రీని చెప్యాల గ్రామానికి చెందిన ఆమె పెద్దమ్మ భాగ్య పిల్లలు లేకపోవడంతో ఆమె ఇంటి వద్దనే ఉంచుకుంటోంది. స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి మంగళవారం ఉదయం మధుశ్రీ కొడిమ్యాల వచ్చింది. రాత్రి సమయంలో తల్లిదండ్రులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొంది. అక్కడ అందరితో కలిసి కోలాటం ఆడింది. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో సుమారు 11.30 గంటల సమయంలో ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన లైట్‌సెట్టింగ్‌కు సంబంధించిన విద్యుత్ తీగ చిన్నారి మెడకు తాకింది. దీంతో మధుశ్రీ అ క్కడికక్కడే అపస్మారక స్థితి లోకి వెళ్లింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే కూతు రు చనిపోవడంతో తల్లిదండ్రులతోపాటు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెద్దమ్మ భాగ్య గుండెలవిసేలా రోధించారు. నూరేళ్లు నిండాయా తల్లి అంటూ విలపించడంతో స్థానికులు, భక్తులు కంటతడిపెట్టుకున్నారు.
నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా..?
బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ లైటింగ్ కోసం పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి నేరుగా వైర్లు తగిలించి కనెక్షన్ ఇచ్చారు. నిర్లక్ష్యంగా.. ముదు జాగ్రత్త చర్యలు పాటించకుండా వేసిన ఆ కరెంట్ వైర్లే చిన్నారి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ఆలయ కమిటీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ చిన్నారి బంధువులు బుధవారం మృతదేహంతో ఆలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై సందీప్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బంధువులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. ఇలాంటి నిర్లక్ష్యపు కనెక్షన్లపై విద్యుత్ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ప్రమాదం జరిగేది కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. మధుశ్రీ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో అపశృతి
కరెంట్ షాక్ తగిలి 11 ఏళ్ల చిన్నారి మృతి
న్యాయం కోసం ఆందోళన
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం


