కలప దొంగల అరెస్ట్
● జిల్లాలో మొదటిసారిగా డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు
● పట్టుకున్న ఆరు టేకు దుంగలు
రాయికల్: కలప దొంగలను పట్టుకునేందుకు మొదటిసారిగా డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించగా.. ఇద్దరు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.92,279 విలువైన టేకు కలపను స్వాధీనం చేసుకున్నట్లు రాయికల్ ఎఫ్‌ఆర్వో భూమేశ్ తెలిపారు. బుధవారం రాయికల్ అటవీశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని బోర్నపల్లి అటవీ ప్రాంతం చింతలూరు సెక్షన్ పరిధిలో ఆరు టేకు చెట్లను నరికివేశారు. అదే సెక్షన్ పరిధిలో మూడు నెలల క్రితం కలపను అక్రమంగా రవాణా చేశారు. నిందితులను పట్టుకోవాలన్న ఉద్దేశంతో మొదటిసారిగా నిర్మల్ జిల్లా జన్నారం రేంజ్‌లోని కేటీఆర్ సర్కిల్ డాగ్‌స్క్వాడ్ బృందం సభ్యుల సహాయంతో తనిఖీలు చేపట్టారు. డాగ్‌స్క్వాడ్ బోర్నపల్లి గ్రామంలోని గంగరాజం, ఆంజనేయులు ఇంటి వద్ద ఆగిపోవడంతో అటవీశాఖ అధికారులు వారిని విచారించగా నిజం అంగీకరించారు. వారి నుంచి రూ.92,279 విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. వారు నరికిన చెట్ల విలువ మాత్రం రూ.1,82,494 ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాలోనే మొదటిసారిగా డాగ్‌స్క్వాడ్ సహాయంతో నిందితులను గుర్తించామని ఎఫ్‌ఆర్వో పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మ, జన్నారం డాగ్‌స్క్వాడ్ బీట్ ఆఫీసర్ అనిల్‌కుమార్, సెక్షన్ ఆఫీసర్ మల్లన్న, విజయ్‌కుమార్, బీట్ ఆఫీసర్ రత్నాకర్, బేస్‌క్యాంప్ వాచర్ బాపురావు పాల్గొన్నారు.


