భార్యను హతమార్చిన భర్త అరెస్ట్
సైదాపూర్(హుస్నాబాద్): మాజీ భార్యను హత్య చేసిన చింతకుంట్ల మహిపాల్‌రెడ్డి(46)ని అరెస్టు చేసినట్లు హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. వివరాలు.. సైదాపూర్ మండలం రాములపల్లికి చెందిన మహిపాల్‌రెడ్డికి చెల్పూర్ పంచాయతీ పరిధి తోకలపల్లికి చెందిన సుకృతతో 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు. నేర ప్రవృత్తి కలిగిన మహిపాల్‌రెడ్డి భార్య ఉండగానే 2002లో ఓ యువతిని ప్రేమ పేరుతో తీసుకెళ్లాడు. ఆమె బంధువులు వెతికి ఇంటికి తీసుకెళ్లగా అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంది. ఈక్రమంలో సుకృతను తరచూ వేధించడంతో తల్లిగారింటికి వెళ్లింది. దీంతో 2009లో మహిపాల్‌రెడ్డి రాములపల్లికి చెందిన రమాదేవిని పెళ్లి చేసుకోగా, సుకృత కేసులు పెట్టింది. కేసులు నడుస్తుండగానే సుకృతకు మహిపాల్‌రెడ్డి 20 గుంటల భూమి ఇవ్వగా, కూతురు పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. సదరు భూమి తిరిగి ఇవ్వాలని ఆమెతో గొడవపడుతున్నాడు. ఈ నెల 22న మధ్యాహ్నం పొలం వద్ద సుకృతపై పెట్రోల్ పోసి తగలబెట్టి పరారయ్యాడు. మంగళవారం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈసందర్భంగా ఎస్సై తిరుపతి, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.


