‘హైబ్రీడ్‌’ సాగు చేస్తున్నారా..?! | - | Sakshi
Sakshi News home page

‘హైబ్రీడ్‌’ సాగు చేస్తున్నారా..?!

Nov 26 2025 6:55 AM | Updated on Nov 26 2025 6:55 AM

‘హైబ్

‘హైబ్రీడ్‌’ సాగు చేస్తున్నారా..?!

కంపెనీల మాయాజాలం ఏజెంట్ల వలల్లో చిక్కొద్దు ముందే ఒప్పందాలు చేసుకుంటే మేలు

ఉమ్మడిగా ఒప్పందాలు చేసుకోవాలి

జగిత్యాలఅగ్రికల్చర్‌: యాసంగి సీజన్‌లో విత్తనోత్పత్తికి అనువైన పొడి వాతావరణం జిల్లాలో ఉంటుంది. దీంతో పలు ప్రైవెట్‌ కంపెనీలు వరి, మొక్కజొన్న, ఆవాలు, నువ్వు పంటలు పండించి ఇతర రాష్ట్రాలకు విత్తనాలుగా ఎగుమతి చేస్తుంటాయి. వరి విత్తనోత్పత్తిని వెల్గటూర్‌, గొల్లపల్లి, ధర్మపురి మండలాల్లో చేస్తుండగా.. మొక్కజొన్నను జగిత్యాల, మేడిపల్లి, రాయికల్‌, సారంగాపూర్‌ మండలాల్లో, ఆవాలను జగిత్యాల, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మెట్‌పల్లి, కథలాపూర్‌ ప్రాంతాల్లో చేస్తుంటారు. నువ్వులను కోరుట్ల, సారంగాపూర్‌, మేడిపల్లి ప్రాంతాల్లో, సజ్జను మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌ ప్రాంతాల్లో పండిస్తారు. యాసంగి సీజన్‌లో పెద్దగా వర్షాలు ఉండవు. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా 35 నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటాయి. పొద్దంతా పొడి వాతావరణం ఉంటుంది. పరాపరాగ సంపర్కం జరిగేందుకు అనువైన మధ్యాహ్న వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలనే విత్తనోత్పత్తికి కంపెనీలు ఎంపిక చేసుకుంటాయి. ఇలా జిల్లాలో 15వేల ఎకరాల వరకు వరి, 10వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఐదు వేల ఎకరాల్లో ఆవాలు, ఐదు వేల ఎకరాల్లో నువ్వులను విత్తనోత్పత్తిగా సాగు చేస్తున్నారు.

కంపెనీ విత్తనాలే..

విత్తనోత్పత్తి చేసే రైతులకు కంపెనీలే విత్తనాలు ఇచ్చి.. సాగు చేయిస్తాయి. కంపెనీ ప్రతినిధులు 15 రోజులకొకసారి వచ్చి పంటలను పరిశీలిస్తారు. వరి, ఆవాల పంటల్లో ఆడ, మగ విత్తనాలు ఇచ్చి, పంట తర్వాత ఆడ విత్తనాలను కొనుగోలు చేస్తారు. మగ విత్తనాలను రైతులు అమ్ముకోవచ్చు. సాధారణ రకాలతో పోల్చితే హైబ్రిడ్‌ విత్తనోత్పత్తి చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు లాభం ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే కంపెనీలు చెప్పినట్లు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడాల్సి ఉంటుంది. హైబ్రిడ్‌ రకాలు కాకుండా సాధారణ రకాలను కూడా కంపెనీలు రైతులతో సాగు చేయిస్తాయి. వీటిని మాములు ధర కంటే రూ.200 నుంచి రూ.300 ఎక్కువ ధర పెట్టి సీడ్‌ప్రాసెసింగ్‌ చేసి ఫౌండేషన్‌ సీడ్‌, సర్టిఫైడ్‌ సీడ్‌ కింద కూడా అమ్ముతున్నాయి.

ఏజెంట్ల ద్వారా ఒప్పందాలు

విత్తనోత్పత్తి చేసే కంపెనీలు గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుంటాయి. కంపెనీలు తమ విత్తనాలకు ఇంతమొత్తం డబ్బు ఇస్తామని రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటాయి. అయితే కొన్ని కంపెనీలు పంట చేతికొచ్చిన తర్వాత మార్కెట్లో ధర లేదని పత్తా లేకుండా పోతున్నాయి. దీంతో విత్తనోత్పత్తి చేసిన రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో రైతులు ఒక్కరిగా కాకుండా.. సంఘాలుగా కంపెనీలతో నేరుగా ఒప్పందాలు చేసుకోవాలి. ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు. కంపెనీలతోనే నిబంధనలు రాసుకోవాలి. ఏ ధర చెల్లిస్తారు..? ఎప్పుడు చెల్లిస్తారు..? వంటి విషయాలన్నింటిని రాసుకోవాలి. అవసరమైతే ఆ ఒప్పందాలను మండల వ్యవసాయాధికారి లేదంటే తహసీల్దార్‌ వంటి అధికారుల సమక్షంలో చేసుకోవడం ఉత్తమం.

కంపెనీలు, ఏజెంట్లు చెప్పుడు మాటలు వినకుండా.. స్టాంప్‌పేపర్‌పై ఇద్దరు సాక్షుల మధ్య ఒప్పందం చేసుకోవడం మంచిది. విత్తనోత్పత్తి చేసే రైతులందరు ఉమ్మడిగా కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలి. అన్యాయం జరిగినప్పుడు కంపెనీపై న్యాయం పోరాటం చేసే అవకాశం రైతుకు ఉంటుంది. ఇస్తామన్న ధర, సాగులోని ఇబ్బందులను కూడా ఆ పత్రంలో రాసుకోవడం మంచిది.

– వడ్డెపల్లి భాస్కర్‌,

జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల

‘హైబ్రీడ్‌’ సాగు చేస్తున్నారా..?!1
1/1

‘హైబ్రీడ్‌’ సాగు చేస్తున్నారా..?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement