ఎడాపెడా ఎరువులు చల్లుతున్న రైతులు అవగాహన కల్పించని అధికారులు మోతాదుకు మించితే పర్యావరణానికీ ముప్పు
ఉత్పాదక శక్తి కోల్పోతుంది
గొల్లపల్లి: అన్నం పెట్టే అన్నదాతలు ప్రకృతిని పట్టించుకోవడం లేదు. పంట బాగా పండితే చాలన్నట్లు.. మోతాదును మించి ఎరువులు చల్లుతున్నారు. అధిక దిగుబడి కోసం యూరియాను అధికంగా వేస్తున్నారు. ఫలితంగా పర్యావరణానికి నష్టం కలగడంతోపాటు నేల నిస్సారంగా.. నీరు కలుషితం అవుతోంది. మరోవైపు చీడపీడలు పెరిగి పంట దిగుబడులూ తగ్గిపోతున్నాయి. పెట్టుబడి పెరిగి తిరిగి భారం పడుతున్నా.. ఆ విషయాన్ని మాత్రం రైతులు గమనించడం లేదు. కొన్నాళ్లుగా యూరియా అమ్మకాల తీరు చూస్తే రైతులు విచ్చలవిడిగా వాడుతున్నట్లు తేలింది.
ఎకరానికి నాలుగైదు బస్తాలు..
జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉంది. ఇందులో అత్యధికంగా వరి 2.90 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. మొక్కజొన్న 42 వేల ఎకరాలు, మిగిలిన ఎకరాల్లో పత్తి, వేరుశనగ, మినుములు, కందులు, పెసలు వంటి పప్పుదినుసులతోపాటు కూరగాయల తోటలున్నాయి. వరి, మొక్కజొన్న పంటలకు రైతులు అత్యధికంగా యూరియా వినియోగిస్తున్నారు. వాస్తవానికి ఎకరాకు రెండునుంచి మూడు బస్తాల యూరియా వినియోగించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నా.. రైతులు మాత్రం ఏకంగా ఐదు నుంచి ఆరు బస్తాలు చల్లుతున్నారు. నానో యూరియా వినియోగించాలని చెప్పినప్పటికీ పెడచెవిన పెడుతున్నారు.
యూరియా సంప్రదాయ ఎరువుగా మారిపోయింది. రైతులు దీనికే అలవాటు పడి మోతాదుకు మించి వేస్తున్నారు. ఫలితంగా భూములు సారం కోల్పోయే ప్రమాదం ఉంది. పంట ఉత్పాదక శక్తి కూడా తగ్గుతుంది. నీరు, గాలి, నేల కలుషితం అవుతాయి. యూరియా ఎంత వేసినప్పటికీ కేవలం 30 శాతమే మొక్క తీసుకుంటుంది. రైతులు ఆలోచించి యూరియాను మోతాదులో వాడాలి. నానో యూరియాతో ప్రకృతికి నష్టముండదు.
– భాస్కర్, డీఏవో


