మహిళా సంక్షేమానికి పెద్దపీట
పెగడపల్లి: మహిళల ఆర్థికాభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో స్వశక్తి సంఘాల మహిళలకు రూ.78 లక్షల విలువైన వడ్డీలేని రుణాల చెక్కులను కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 11,825 సంఘాలకు రూ.10.69 కోట్లు వడ్డీలేని రుణాలు విడుదలయ్యాయని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఆర్డీవో మదుసూధన్, డీఆర్డీవో రఘువరన్, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, తహసీల్దార్ ఆనంద్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికలకు బీసీ సంఘాలు సహకరించాలి
గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు బీసీ సంఘాలు సహకరించాలని మంత్రి కోరారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
విద్యుత్ సమస్యల పరిష్కారంపై దృష్టి
గొల్లపల్లి: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఇళ్ల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్లను మార్చేందుకు రూ.4.30కోట్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. మండలంలోని శ్రీరాములపల్లిలో రూ.60 లక్షలతో 33 కేవీ, 11కేవీ లైన్లు మార్పు పనులను కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. లైన్ల మార్పుతో ప్రజల భద్రత, సౌకర్యం మరింత మెరుగవుతాయన్నారు. ఎస్‌ఈ సుదర్శనం, డీఈ గంగారం, విద్యుత్ శాఖ అధికారులు వరుణ్‌కుమార్, అబ్దుల్ మజీద్, రాకేష్‌కుమార్, ఏఈలు పాల్గొన్నారు.
నిరుపేదల సంక్షేమానికి కృషి
నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. మండలానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి కింద రూ.60 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరా మహిళ శక్తి చీరలను అందించారు.


