భక్తుల కొంగుబంగారం ‘దొంగ మల్లన్న’
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేట శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. దొంగమల్లన్న, షష్ఠి మల్లన్నగా ప్రసిద్ధి చెందిన స్వామివారి జాతర ఏటా మార్గశిర మాస శుద్ధపంచమి నాడు ప్రారంభమవుతుంది. ఏడు వారాల పాటు కొనసాగుతుంది. ఇక్కడ తమ్మిడి కులస్తులు పూజలు చేస్తారు. బుధవారం దండివారంతో జాతర ప్రారంభమవుతుంది. 27న నాగవెల్లి, పెద్దపట్నం, అగ్ని గుండాలు, ఈనెల 30 నుంచి డిసెంబర్ 17వరకు ప్రతి ఆదివారం, బుధవారం ఉత్సవాలు నిర్వహిస్తారు. 18 మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, చండీహవనం, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. దొంగమల్లన్న జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు, ఈవో విక్రమ్, ఫౌండర్ ట్రస్టీ శాంతయ్య, ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్ తెలిపారు.


