బీసీలకు తగ్గిన రిజర్వేషన్
జాబితాల తయారీలో అధికారులు నిమగ్నం ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రతిపాదికన.. బీసీలకు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా.. రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో గెజిట్ విడుదల
జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఇటీవలే రిజర్వేషన్లు ఖరారైన విషయం తెల్సిందే. తాజాగా కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రతిపాదికన.. బీసీలకు డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియను రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలోనే చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 50 శాతం మించొద్దన్న కోర్టు ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. జిల్లాలో 20 మండలాలు.. 385 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ల స్థానాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిలో పూర్తి చేశారు. వాటి ఆధారంగా మహిళలకు రొటేషన్ పద్ధతిలో లాటరీ ద్వారా కేటాయించారు. గెజిట్ విడుదల.. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో జాబితాల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. నోటిఫికేషన్ రాగానే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగనుంది.
ఆశావహుల్లో ఉత్సాహం
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ఉత్సాహంతో ఉన్నారు. కొందరికి రిజర్వేషన్ కలిసి వచ్చినప్పటికీ.. మరికొందరికి శాపంగా మారాయి. పోటీ చేద్దామనుకున్న వారికి రిజర్వేషన్ కలిసిరాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. బీసీలకు మొదట 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే. రెండురోజుల పాటు నామినేషన్లను స్వీకరించారు. హైకోర్టు వాటిని రద్దు చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా 50 శాతం మించి రిజర్వేషన్ ఇవ్వకూడదన్న కోర్టు నిబంధన మేరకు బీసీలకు రిజర్వేషన్ స్థానాల సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా ఆశావహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. అప్పటి లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో పెద్దగా తేడా లేకపోయినప్పటికీ బీసీ కేటగిరీ స్థానాలు భారీగా తగ్గాయి. జనరల్ స్థానాలు మాత్రం పెరిగాయి.
ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో అవకాశం వచ్చిన ఆశావహులు ఇప్పటినుంచే ప్రచారం చేస్తున్నారు. అన్నా.. ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రాధేయపడుతున్నారు. మొదటిసారి ఎన్నికలు వాయిదాపడటంతో కొంతమేర ఆశావహుల్లో ఆసక్తి తగ్గిపోయింది. మళ్లీ రిజర్వేషన్లు ఖరారై నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ప్రచారంలో నిమగ్నమవుతున్నారు.
గ్రామాల్లో సందడి


