కాంగ్రెస్ అంటేనే‘స్కాం’గ్రెస్
జగిత్యాల: కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అని, స్వా తంత్య్రానికి ముందు బ్రిటిష్‌వారు దోచుకుంటే.. వచ్చాక కాంగ్రెస్ దోచుకుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకొచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వం చేసిందేమీలేద న్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను తిట్టడం, కాళేశ్వరంలో అవినీతి అంటూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఏం సాధించిందన్నారు. రియ ల్ ఎస్టేట్ బ్రోకర్‌లాగా సీఎం రేవంత్‌రెడ్డి భూముల ను అమ్మకానికి పెట్టడారన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమిలో ఎకరాకు రూ.100 కోట్ల స్కాం జరుగుతోందన్నారు. కేసీఆర్ ఫార్మాసిటీని 14 వేల ఎకరాల్లో పెడితే.. ఫ్యూచర్ సిటి అంటూ సీఎం అమ్ముతున్నాడని పేర్కొన్నారు. మొత్తంగా రూ.5లక్షల కోట్ల స్కాం చేస్తున్నాడని తెలిపారు. ఆయన వెంట చీటి వెంకట్‌రావు, సాయిరెడ్డి, దశరథరెడ్డి, చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.
సెల్‌ఫోన్‌కు బదులు చెస్ ఆడాలి
కోరుట్ల: విద్యార్థులు సెల్‌ఫోన్‌తో కాకుండా చెస్‌కు అలవాటుపడితే ఏకాగ్రత పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో చెస్‌బోర్డులు పంపిణీ చేశారు. చెస్ నెట్ వర్క్ ఫౌండేషన్ సహకారంతో 15మంది విద్యార్థులకు ఒక చెస్ బోర్డు అందిస్తామన్నారు. ఎంఈఓ గంగుల నరేశం, చెస్ నెట్ వర్క్ ఫౌండర్ సుదీర్ కోదాటి, రవి మయిరెడ్డి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించాలి
మెట్‌పల్లి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని మినీ స్టేడియంలో అస్మిత్ లీగ్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. అండర్–14, 16 విభాగాల్లో రన్నింగ్, షాట్‌ఫుట్, జావెలిన్ త్రో, హైజంప్, లాంగ్ జంప్ నిర్వహించారు. 680 మంది బాలికలు హాజరయ్యారు. డీఎస్పీ రాములు, ఎంఈఓ చంద్రశేఖర్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి ఉన్నారు.
వృద్ధురాలిని చూసి చలించిన ఎమ్మెల్యే
కోరుట్లరూరల్: పట్టణంలోని కల్లూర్ రోడ్ పక్కన తలదాచుకుంటున్న ఓ వృద్ధురాలిని చూసిన ఎమ్మెల్యే చలించిపోయారు. బాలికల పాఠశాలలో చెస్ బోర్డులు పంపిణీ చేసి వెళ్తూ.. ఓ భవనం వద్ద ఆరుబయట పాత బట్టలు, సామగ్రితో కూర్చున్న వృద్ధురాలిని గమనించి ఆమె వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకొన్నారు. కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామమని, భర్త మృతి చెందారని, పిల్లలెవరూ పట్టించుకోవటం లేదని, గ్రామంలో ఎవరూ తనకు ఇట్లు అద్దెకివ్వటం లేదని పేర్కొంది. కోరుట్లకు వచ్చి ఇక్కడే ఉంటున్నానని, ఎవరైనా భోజనం పెడితే తింటున్నా.. లేకుంటే పస్తులుంటున్నానని పేర్కొంది. దీంతో ఎమ్మెల్యే వెంటనే ఆర్డీవో జివాకర్‌రెడ్డికి ఫోన్ చేశారు. వృద్ధురాలికి న్యాయం చేయాలని, లేకుంటే షెల్టర్ హోంకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.


