అతివలకు అందలం
సర్పంచ్ రిజర్వేషన్లలో మహిళలకు పెద్దపీట 385 పంచాయతీల్లో 174 స్థానాలు కేటాయింపు జనరల్ స్థానాల్లోనూ మహిళలకు అవకాశం ఎస్టీ రిజర్వేషన్లలో మాత్రం అన్యాయం
జగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికారులు గ్రామాలవారీగా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ నివేదికకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఆమోదం కూడా తెలిపింది. ఈ రిజర్వేషన్లలో ఈ సారి మహిళలకు పెద్దపీట వేసినట్లయ్యింది. జిల్లాలో మొత్తం 385 గ్రామపంచాయతీలు ఉండగా.. మహిళలకు 174 స్థానాలు కేటాయించారు. అలాగే జనరల్‌కు కేటాయించిన 211 స్థానాల్లోనూ పురుషులతోపాటు మహిళలు పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ లెక్కన అత్యధిక స్థానాల్లో మహిళలే పోటీ చేయనున్నారు. వార్డుల్లో కూడా మహిళల సంఖ్యనే ఎక్కువగా కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 3,536 వార్డులు ఉండగా మహిళలకు 1524 వార్డులు కేటాయించారు. అలాగే పురుషులతోపాటు మహిళలకు 2014 వార్డులు కేటాయించారు. మహిళా రిజర్వేషన్‌తోపాటు, జనరల్ స్థానాల్లోనూ పోటీకి అవకాశం ఉండటంతో వారు 50 శాతం కంటే మించి వార్డులు, సర్పంచ్ స్థానాలు దక్కించుకోనున్నారు.
రాయికల్‌లో అత్యధిక పంచాయతీలు
జిల్లాలో అత్యధిక గ్రా మపంచాయతీలు ఉ న్న మండ
లంగా రాయికల్ నిలుస్తోంది. ఇక్కడ 32 గ్రామాలు ఉన్నాయి. రెండోస్థానంలో జగిత్యాలరూరల్ మండలం ఉంది. ఇక్కడ 29 గ్రామ పంచాయతీలున్నాయి. అతితక్కువ గ్రామపంచాయతీలు జగిత్యాల అర్బన్‌లో ఉన్నాయి. ఇక్కడ కేవలం ఐదు పంచాయతీలే ఉన్నాయి.
మూడు విడతల్లో ఎన్నికలు
సర్పంచ్ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి విడతలో కోరుట్ల, మేడిపల్లి (వేములవాడ నియోజకవర్గం) మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల్లో.. మూడో విడత ధర్మపురి నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.


