ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులో వసూళ్లు కొందరు నాయకులు, ఉద్యోగుల తీరుతో ఇబ్బందులు లంచం అడిగితే రోకలితో కొట్టాలన్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్
ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్
‘ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే రోకలిబండతో కొట్టండి.. ఈ విషయంలో అవసరమైతే నేనే జైలుకు వెళ్తా.. ఇళ్ల పథకం మన హక్కు. ఎవరైనా అడ్డుకుంటే ఈడ్చికొట్టండి..’ ఇది రెండు రోజుల క్రితం మెట్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేసిన వ్యాఖ్యలు. ఇళ్ల మంజూరు విషయంలో కొందరు డబ్బులు అడుగుతున్నారని ఆయనకు ఫిర్యాదులు రావడంతో ఆగ్రహం చెందిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి.
మెట్‌పల్లి: పేదల ప్రజలకు సొంతింటి కలను నిజం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతేడాది మార్చిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికింద ఇంటి నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారుకు రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అయితే కొందరు నాయకులు, ఉద్యోగులు ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు విషయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడిగినంత ఇస్తేనే లబ్ధి కలిగేలా చూస్తున్నారని, లేకుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాలుగు దశల్లో బిల్లుల చెల్లింపు
● ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు దశల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తోంది.
● మొదట బేస్‌మెంట్ పూర్తయిన తర్వాత రూ.లక్ష, గోడలు నిర్మించిన అనంతరం రూ.1.25లక్షలు, శ్లాబ్ పూర్తయిన తర్వాత రూ.1.75లక్షలు, మిగతా రూ.లక్ష ఇల్లు పూర్తి అయిన తర్వాత మంజూరు చేస్తోంది.
అక్కడక్కడా డబ్బులు వసూలు..
● ప్రభుత్వం పారదర్శకంగా పథకం అమలు చేసి పేదలకు తమ సొంతింటి కలను సాకారం చేయాలని నిర్ణయించినప్పటికీ.. కొందరు నాయకులు, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
● లబ్ధిదారుగా ఎంపిక చేయడం కోసం రూ.50వేల చొప్పున.. బిల్లు మంజూరు చేసే సమయంలో రూ.10వేల చొప్పున అక్కడక్కడా కొందరు వసూలు చేస్తున్నట్లు వార్తలు విని పిస్తున్నాయి.
● కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌కు ఇలాంటి ఫిర్యాదులు రావడంతో ఆయన స్పందించారు. డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండని తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
● గతంలో ఓ లబ్ధిదారు నుంచి డబ్బులు వసూలు చేసిన మెట్‌పల్లి వార్డ్ ఆఫీసర్‌ను ధర్మపురి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు ఫిర్యాదు మేరకు కలెక్టర్ సస్పెండ్ చేశారు.
జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ప్రభుత్వం ఈ పథకం కింద 3500 ఇళ్లను మంజూరు చేసింది. మొత్తంగా 11,033 ఇళ్లను కేటాయించింది.
ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల ద్వారా జిల్లావ్యాప్తంగా ఇళ్ల మంజూరుకు అనుగుణంగా ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది.
పథకం అమలుకు సంబంధించిన నిబంధనలు కఠినంగా ఉండడంతో ప్రారంభంలో ఆశించిన స్థాయిలో లబ్ధిదారులు పనులు ప్రారంభించడానికి ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం వాటిని సడలించడంతో ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి.
ఇప్పటివరకు కేవలం ఏడు మాత్రమే పూర్తయ్యాయి. 7,634 ఇళ్లకు మార్కింగ్ ఇచ్చారు. 3,091 బేస్‌మెంట్ లెవల్‌లో ఉన్నాయి. 1031 గోడల లెవల్‌లో ఉన్నాయి. 783 రూప్ లెవల్ వరకు పూర్తయ్యాయి.
లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం కోసం గృహ నిర్మాణ శాఖ ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ 18005995991 ను అందుబాటులోకి తీసుకవచ్చింది.
ఇళ్లకు సంబంధించి, బిల్లుల చెల్లింపు విషయంలో ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.


