రోడ్ల విస్తరణ ఎప్పుడో..?
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి పట్టణంలో పలు రోడ్లు విస్తరణకు నోచుకోలేదు. ముఖ్యంగా జగిత్యాలకు ప్రధానమైన రోడ్డు యావర్‌రోడ్డు. ఇది ఎన్‌హెచ్–63 జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది. జిల్లా కేంద్రం కావడం, లక్షకు పైగా జనాభా ఉండటం నిత్యం పనులపై ఎంతోమంది ఇక్కడకు వస్తుంటారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం వచ్చి ఉపాధి పొందుతూ ఇక్కడే ఉంటున్నారు. ఫలితంగా రద్దీ అత్యధికంగా పెరిగిపోయింది. జగిత్యాలకు ప్రధానంగా రోడ్ల సమస్య ఉంది. ఐదేళ్లకోసారి ప్రజాప్రతినిధులు మారుతున్నా జగిత్యాల రూపురేఖలైతే మారడం లేదు. డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు ఈ యావర్‌రోడ్ ఇరుకుగా ఉండటంతో గతంలో బైపాస్‌రోడ్‌ను నిర్మించారు. జిల్లా కేంద్రం కావడంతో బైపాస్‌రోడ్ పూర్తి ట్రాఫిక్‌మయంగా మారిపోయింది. స్కూళ్లు, హోటళ్లు, వాణిజ్య వ్యాపారాలు ఆ రోడ్డుపై వెలవడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా ఉంటుంది.
యావర్‌రోడ్డు విస్తరణ జరిగేనా..?
జిల్లాకేంద్రంలో అతిపెద్ద సమస్య యావర్‌రోడ్డు. గతంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ రోడ్డు విస్తరణ కోసం కృషి చేశారు. యావర్‌రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోటనే 100 ఫీట్ల రోడ్లు చేపట్టారు. మిగతావి కేసుల్లో ఉండటంతో అలాగే ఉండిపోయాయి.
ఆక్రమణలు
ఈ యావర్‌రోడ్డుగా ఉన్న నేషనల్ హైవే రహదారి చిన్నగా మారింది. 80 ఫీట్లతో ఇరుకుగా మారింది. పైగా వాణిజ్య వ్యాపారులు రోడ్డును ఆక్రమించుకుని ఎలాంటి సెట్‌బ్యాక్‌లు పాటించకుండా నిర్వహించడంతో ప్రజల రాకపోకలకు కష్టంగా మారుతోంది. వాహనాలు వెళ్లాలన్నా ప్రమాదకరంగా మారింది. ఇటీవల మాజీమంత్రి జీవన్‌రెడ్డి కూడా యావర్‌రోడ్డులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
బైపాస్ అంటేనే భయం
జిల్లాకేంద్రం కాకముందు ప్రజల వెసులుబాటు కోసం బైపాస్‌రోడ్‌ను ఏర్పాటు చేశారు. గతంలోనే 100 ఫీట్ల బైపాస్‌రోడ్డు ఏర్పాటు చేస్తే బాగుండేది. ఇటు జనాభా, ట్రాఫిక్ పెరిగిపోవడంతో ఆ రోడ్డు ప్రస్తుతం ఇబ్బందిగా మారింది.
ఇరుకై న రోడ్లే..
జిల్లా కేంద్రంలో ప్రదానమైన రోడ్లన్నీ ఇరుకుగానే ఉన్నాయి. 1983 నాటి మాస్టర్ ప్లానే అమలు కావడంతో రోడ్లు అభివృద్ధి కావడం లేదు. కొత్త మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడం, రోడ్లు విస్తరణ కాకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. కనీసం బైక్‌లు పెట్టుకుందామన్నా స్థలాలు లేని పరిస్థితి. ముఖ్యంగా తహసీల్ చౌరస్తా, టవర్ నుంచి కొత్తబస్టాండ్, గంజ్ ప్రాంతంలో కనీసం ఆటో కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి యావర్‌రోడ్‌తో పాటు, బైపాస్‌రోడ్ల విస్తరణ చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
రోడ్ల విస్తరణ ఎప్పుడో..?


