కంకర అక్రమ రవాణాకు అడ్డుకట్ట
గొల్లపల్లి: క్వారీలు, క్రషర్ల ద్వారా నిత్యం భవన నిర్మాణాలు, రహదారులు, వాణిజ్య తదితర అవసరాలకు టన్నుల కొద్ది కంకరను రవాణా చేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొడుతూ వ్యాపారులు జేబులు నింపుకొంటున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఓవర్ లోడ్‌తో కంకరను తరలిస్తున్న వాహనాలు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. ఇటీవల చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఎంతోమంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో ప్రభుత్వం పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది.
టన్నుల కొద్దీ రవాణా
జిల్లాలో సుమారు 16 వరకు క్రషర్లు ఉన్నాయి. వీటి నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం వందలాది టిప్పర్ల ద్వారా కంకర రవాణా అవుతోంది. నిబంధనల ప్రకారం 15 టన్నులు, 20 టన్నులు తరలించాల్సిన టిప్పర్‌లో 8 నుంచి పది టన్నులు అదనంగా తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ సీనరేజ్, రాయల్టీ, డీఎంఎఫ్టీ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని క్రషర్ల యజమానులు తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కనిపించని వేబ్రిడ్జిలు, సీసీ కెమెరాలు
జిల్లాలోని ఏ క్వారీలో చూసినా కనీసం వేబ్రిడ్జిలు మచ్చుకై నా కానరావడం లేదు. ఇక సీసీ కెమెరాల ఊసే లేదు. మరోవైపు అధికారుల పర్యవేక్షణలోపం కూడా తోడవుతోంది. క్వారీల్లో ఎంత మేర తవ్వుతున్నారు..? కంకర ఎంత తరలిస్తున్నారు..? అనే లెక్కలు తీయడం లేదు. వాస్తవానికి టన్ను కంకరకు రూ.150 రాయల్టీ (పర్మిట్, డీఎంఎఫ్, ఐటీ) చెల్లించాలి. మొరానికై తే రూ.40 చొప్పున గనుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. కాంటా వేసే వ్యవస్థ లేకపోవడం, తనిఖీలు నామమాత్రంగా నిర్వహించడంతో వ్యాపారులు రాయల్టీని కూడా అంతంత మాత్రంగానే చెల్లిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి క్రషర్‌లో వేబ్రిడ్జి, సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటిని నెల రోజుల్లో ఏర్పాటు చేయాలని అధికారులు క్రషర్ల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు.
యూనిట్ల ప్రకారం రాయల్టీ
నెల రోజుల వ్యవధిలో ఒక్కో క్రషర్ నిర్వహణకు రూ.20 వేల విద్యుత్ ఖర్చయితే అందులో నాలుగో వంతు అంటే రూ.5వేలు, దీనికి సమానంగా అంటే ఐదు వేల టన్నులకు రాయల్టీ చెల్లించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక నుంచి రెట్టింపు జరిమానా విధిస్తారు. క్రషర్‌లో ఏర్పాటు చేసే వేబ్రిడ్జి జిల్లా గనుల శాఖ కార్యాలయానికి అనుసంధానమై ఉంటుంది. దీని ఆధారంగా కంకర ఎంత కాంటా వేశారు..? ఎంత తరలిస్తున్నారు..? అదనంగా ఏమైనా తరలిస్తున్నారా..? అనేది అధికారులు పర్యవేక్షించనున్నారు.
పక్కాగా లెక్కలు
క్వారీల నుంచి తీసిన రాళ్లు, బండల నుంచి ఎంత మొత్తంలో వ్యాపారులు క్రషర్ల ద్వారా కంకర తయారు చేయనున్నారో అధికారులు వద్ద ఇక పక్కాలెక్కలు ఉండనున్నాయి. ఈ మేరకు వ్యాపారుల నుంచి రాయల్టీ వసూలు చేయనున్నారు. డీజిల్‌తో నడిచే యంత్రాల ద్వారా కంకర తయా రు చేసినా మీటర్ ఏర్పాటు చేయాలనే నిబంధన విధించారు. క్రషర్ యూనిట్ల నుంచి కంకర తీసుకెళ్లే వాహనాల నంబర్లు, తూ కం వివరాలను గనుల శాఖ వెబ్‌సైట్‌లో అధికారులు అనుసంధానం చేయనున్నారు. ఈ విషయమై మైనింగ్ ఏడీ జైసింగ్ మాట్లాడుతూ.. క్వారీల్లో సీసీ కెమె రాలు ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యాలకు నోటీసులు అందించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు.


