నేర్చుకోవాలి.. పంట పండించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు బృందాలుగా ఏర్పడి తాము చదువుకున్న కోర్సులో భాగంగా పంటలు సాగు చేయాల్సి ఉంటుంది. విత్తనం నాటింది మొదలు.. మార్కెటింగ్ వరకు వ్యవసాయ పనులన్నీ విద్యార్థులే చేయాల్సి ఉంటుంది. పొలాస వ్యవసాయ కళాశాలలో బీఎస్పీ అగ్రికల్చర్ నాలుగో ఏడాది విద్యార్థులు పాలిహౌస్‌లో కూరగాయలు సాగుచేస్తున్నారు.
14 మంది విద్యార్థుల బృందం
ఒకే పంటపై ఆసక్తి ఉన్న 14 మంది విద్యార్థులు బృందంగా ఏర్పడ్డారు. వీరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.అరుణ్‌కుమార్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. వీరంతా కళాశాలను ఆనుకుని ఉన్న పాలిహౌస్‌లో క్యాబేజీ, కాలిఫ్లవర్, టమాట సాగు చేస్తున్నారు. కోర్సు మేనేజర్‌తో సమావేశమై పంట ప్రణాళికను రూపొందిస్తారు. రకరకాల కంపెనీల విత్తనాలను పరిశీలించి.. నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. సేంద్రియ ఎరువులు వేసి, విత్తనాన్ని నారుగా పోసి, మొక్కలు నాటి డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు.
సేంద్రియ పద్ధతిలో సాగు
మొక్కలను నాటే ముందు వర్మి కంపోస్టు వేయడంతోపాటు, మొక్కలు పెరిగిన తర్వాత తెగుళ్లు, పురుగులు ఆశించకుండా వేపనూనె పిచికారీ చేస్తున్నారు. కలుపు మొక్కలు ఆశించకుండా.. వేర్లకు గాలి తగిలేలా మట్టిని కదిలిస్తూ ఉంటారు. సమస్య వస్తే విద్యార్థులంతా నిర్ణయం తీసుకుంటారు. చివరకు పంటను అమ్మి లాభాలు కూడా చూపించాల్సి ఉంటుంది. పొలాస వ్యవసాయ కళాశాల బ్రాండ్‌తో విక్రయిస్తుండటంతో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు రెండుమూడు టన్నుల వరకు కూరగాయలు విక్రయించారు.


