కేరళ తరహా గల్ఫ్ పాలసీ అమలు చేయాలి
జగిత్యాలటౌన్: కేరళ తరహాలో గల్ఫ్ పాలసీని అమలు చేసి బాధితులకు అండగా నిలవాలని వక్తలు డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు బూతుకూరి కాంత, బీఎన్‌రావు అధ్యక్షతన ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన గల్ఫ్‌గోస కార్యక్రమానికి రాజకీయ విశ్లేషకులు ప్రకాశ్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, తెలంగాణ విఠల్, ప్రొఫెసర్ సూరపెల్లి సుజాత ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విదేశాల్లో మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలన్నారు. కార్మికుల సంక్షేమానికి పలు సూచనలు చేశారు. కేరళ తరహాలో గల్ఫ్ పాలసీని రూపొందించాలని, వయసుతో నిమిత్తం లేకుంగా గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రైతుబీమా తరహాలో రూ.5లక్షల పరిహారం అందించాలని సూచించారు. మృతదేహాలను స్వదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, రూ.500కోట్లతో అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని, గల్ఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటూ స్వదేశానికి సమాచారం అందించేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాని కోరారు. ఐఏఎస్ అధికారి అధ్యక్షతన గల్ఫ్ సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఫేక్ గల్ఫ్ ఏజెంట్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో గల్ఫ్ బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.


