కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం
అందుకే డైవర్షన్ పాలిటిక్స్.. కేటీఆర్, హరీష్‌రావు నిరాధార ఆరోపణలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మహిళలకు ఇందిరమ్మ చీరెల పంపిణీ
జగిత్యాలటౌన్: ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు తప్పదని, జైలుకెళ్లి కండలు పెంచాలన్న ఆయన కోరిక త్వరలో నెరవేరనుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ అనుమతి లభించడంతో రేపో.. ఎల్లుండో కేటీఆర్ అరెస్టు తప్పదని తేలడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు రూ.5లక్షల కోట్ల అవినీతి అంటూ కేటీఆర్, హరీశ్‌రావు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల కలెక్టరేట్‌లో ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రజలు కేటీఆర్, హరీశ్‌రావుకు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ది రాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శిథిలం చేసి ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెట్టిందన్నారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనంతో పనిచేయాలని ఛీప్ పాలిటిక్స్ చేయొద్దని సూచించారు. కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీఆర్‌డీవో రఘువరణ్ తదితరులు పాల్గొన్నారు.


