
ఘొల్లుమన్న గోపాల్‌రావుపల్లె
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): గోపాల్‌రావుపల్లె.. పచ్చటి పొలాలు, ఎతైన గుట్టలు.. మధ్యమానేరు బ్యాక్ వాటర్.. పాడిపంటలతో కళకళలాడే ఊరు. ఆ ఊరిలో ఉన్నత కుటుంబంలో పుట్టిన నూనూగుమీసాల యువకుడు.. నాలుగున్నర దశాబ్దాల క్రితం పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమబాట పట్టాడు. ఈ తరం వారికి అతనెవరో తెలియదు. కానీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్‌మఢ్ అడవుల్లో సోమవారం ఎన్‌కౌంటర్‌లో మరణించిన కొస అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ సాధు ఉన్నట్లు తెలియడంతో ఒక్కసారిగా గోపాల్‌రావుపల్లె వార్తల్లోకెక్కింది. కొస పార్థీవదేహం గురువారం ఉదయం 10.20 గంటలకు ఆ పల్లెకు చేరగానే ఆ ఊరంతా కన్నీటిసంద్రమైంది. నాలుగున్నర దశాబ్దాలుగా కంటికి, ఇంటికి దూరమైన మావోయిస్టు అగ్రనేత కొస ప్రస్థానం అంత్యక్రియలతో ముగిసింది.
● ఎరుపెక్కిన ఊరు
కడారి సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ముద్దుగా పిలుచుకునే సత్యం పార్థీవదేహం రావడంతో అప్పటికే ఊరు చేరిన ప్రజాసంఘాల ప్రతినిధులు, పౌరహక్కుల నేతలు, కళాకారులు, మాజీ మావోయిస్టు నేతలు ఎర్రజెండాలు కప్పి నివాళి అర్పించారు. కొస చిత్రపటంతో కూడిన ప్లెక్సీలను ప్రదర్శించారు. సత్యనారాయణరెడ్డి మృతదేహం గ్రామానికి చేరగానే ప్రజాకళాకారులు పాటలతో కొసను తలచుకుంటూ ఉద్యమ గీతాలు ఆలపించారు. పిడికిళ్లు బిగించి నివాళులు అర్పిస్తూ, జోహార్లు చెబుతూ హోరెత్తించారు. మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభం కాగానే ఓ వైపు వర్షం మరోవైపు రోడ్డుపై బురద ఉన్నా.. జనం లెక్క చేయకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, కళాకారుల ఉద్యమ గీతాలు, ఆవేశపూరిత ప్రసంగాలతో అంతిమయాత్ర సాగింది.
● తరలివచ్చిన అభిమానులు
సత్యనారాయణరెడ్డి అంతిమయాత్రకు ప్రజాసంఘాల ప్రతినిధులు గాదె ఇన్నయ్య, ఉద్యోగ సంఘాల ప్రతినిధి దేవిప్రసాద్, పౌరహక్కుల సంఘం నాయకులు నక్క నారాయణరావు, మాదన కుమారస్వామి, దళిత లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకులు మార్వాడి సుదర్శన్, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ ప్రతినిధి పద్మకుమారి, ప్రజాసంఘాల ప్రతినిధులు శాంతి, యాదవ్వ, లక్ష్మి, భవాని, మాజీ మావోయిస్టులు జ్యోతి, అమర్, గాజర్ల అశోక్, సిదన్న, దళిత సంఘాల ప్రతినిధులు రాగుల రాములు, రంజిత్, కవులు జూకంటి జగన్నాథం, గాయకులు నాగరాజు, శ్రీకాంత్, అభిమానులు, జిల్లాలోని పలు గ్రామాల ప్రతినిధులు తరలి రావడంతో గోపాల్‌రావుపల్లె జనసంద్రమైంది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతుందని, మోదీ, అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు నాయకులు పాడెమోశారు. వర్షంలోనూ కన్నీటి వీడ్కోలు పలికారు.
● కొస భార్య కూడా ఎన్‌కౌంటర్‌లో బలి
సత్యనారాయణరెడ్డి ఇల్లు విడిచి ఉద్యమంలో చేరినప్పుడు అతనికి పెళ్లికాలేదు. నిజానికి పెళ్లి చేసుకుంటే.. విప్లవ ఉద్యమంలో పని చేయడం ఇబ్బందిగా ఉంటుందని భావించి ముందే పిల్లలు కాకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న కమిట్‌మెంట్ ఉద్యమకారుడు. గర్చిరోలి జిల్లా కార్యదర్శిగా ఉండగా ఆదివాసీ మహిళ అయిన చడిమేక్ రుక్మిణి అలియాస్ రాధను పెళ్లి చేసుకున్నాడు. ఉద్యమ సహచరిగా ఉన్న ఆమె బస్తర్ జిల్లా మావోయిస్టు కార్యదర్శి హోదాలో ఏడాది క్రితం ఎన్‌కౌంటర్‌లో మరణించింది. కొస కుటుంబ సభ్యులకు మాత్రం అతనికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసినా, ఉద్యమంలో రాధను పెళ్లి చేసుకున్నట్లు మాజీ మావోయిస్టులు వెల్లడించారు.
కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస(ఫైల్)
కొస భార్య రాధా అలియాస్ రుక్మిణి(ఫైల్)
శోకసంద్రమైన ఊరు
45 ఏళ్లకు విగతజీవిగా ఇల్లు చేరిన కడారి సత్యనారాయణరెడ్డి
మావోయిస్టు కొసకు కన్నీటి వీడ్కోలు
తరలివచ్చిన ప్రజలు, పౌరహక్కుల నేతలు, బాల్యమిత్రులు

ఘొల్లుమన్న గోపాల్‌రావుపల్లె

ఘొల్లుమన్న గోపాల్‌రావుపల్లె

ఘొల్లుమన్న గోపాల్‌రావుపల్లె

ఘొల్లుమన్న గోపాల్‌రావుపల్లె