
శునకాలతో భయంభయం
● మందలుగా తిరుగుతున్న కుక్కలు ● జిల్లాకేంద్రంలోని మూడు వార్డుల్లో ఎమర్జెన్సీ ● రోడ్లవెంట వెళ్తున్నవారిపై దాడులు ● భయాందోళనలో స్థానికులు
జగిత్యాల: జిల్లాకేంద్రంలో మళ్లీ కుక్కల బెడద మొదలైంది. రోడ్లపైకి రావాలంటేనే చిన్నారులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని వీధుల్లో కుక్కలు వెంటబడి కరుస్తుండటంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. గతంలో కుక్కల బెడద నుంచి తప్పించాలని అత్యధికంగా ఫిర్యాదులు రావడంతో హైకోర్టు స్పందించి వెంటనే నివారించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాకేంద్రంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
డంపింగ్‌యార్డు వద్ద యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్
జిల్లాకేంద్రంలోని టీఆర్‌నగర్‌లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 36 కన్నెల్స్‌ను ఏర్పాటు చేసి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టారు. గతంలో టెండర్లు నిర్వహించగా హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీ ఒక్కో కుక్కకు రూ.1450 చొప్పున ఒప్పందం చేసుకున్నారు. 2024 ఆగస్టు 9న కుక్కలను పట్టేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలో సుమారు రెండు వేల వరకు కుక్కలను పట్టి కు.ని ఆపరేషన్లు చేశారు. దీనికో కమిటీ వేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా చేశారు. చాలావరకు ఆపరేషన్లు చేసి కుక్కలను తిరిగి వీధుల్లో విడిచిపెట్టారు. ఆపరేషన్లు చేసినట్లు గుర్తుగా చెవి కత్తిరించారు. ఏమైందో ఏమోగానీ కు.ని. నిలిపివేయడంతో మళ్లీ మొదటికి వచ్చింది. బిల్లులు విడుదల చేయకపోవడంతో వారు ఆపేసినట్లు తెలిసింది. జనవరి నుంచి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిచిపోయాయి. అప్పటినుంచి మళ్లీ కుక్కల బెడద ఎక్కువైంది.
పెరుగుతున్న కుక్కల దాడులు
జనవరిలో నిలిచిపోయిన కుక్కల కు.ని ఆపరేషన్లను ఇప్పటివరకు మళ్లీ చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో దాదాపు ఐదు నుంచి ఎనిమిది వేల కుక్కలు ఉంటాయని అంచనా. జిల్లాకేంద్రంలోని ప్రతి వార్డుల్లో గుంపులుగుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఉదయం రోడ్ల వెంటే..
తెల్లారిందంటే చాలు.. ప్రధాన రోడ్ల వెంట మందలుమందలుగా కనిపిస్తున్నాయి. ఉదయంపూట బడికి వెళ్లే విద్యార్థులు, విధులకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే చిన్నారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు వెంటపడుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కొందరు తీవ్రంగా గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కుక్కలకు కు.ని. నియంత్రణ ఆపరేషన్లు నిరంతరం చేపడతామని చెప్పినప్పటికీ అర్ధంతరంగా నిలిచిపోవడంతో మళ్లీ ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి కుక్కలకు కు.ని ఆపరేషన్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మూడు వార్డుల్లో ఎమర్జెన్సీ
జిల్లా కేంద్రంలోని మూడు వార్డుల్లో ఎమర్జెన్సీగా కుక్కలను పట్టాలని అధికారులు పేర్కొంటున్నప్పటికీ ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. అధికారులు స్పందించి ఆ మూడు వార్డుల్లో కుక్కలను పట్టేలా ఏజెన్సీ వారితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
మళ్లీ ప్రారంభిస్తాం
ప్రస్తుతం నిలిచిపోయినప్పటికీ వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. మూడు వార్డుల్లో ఎమర్జెన్సీ ఉన్నట్లు తెలిసింది. వారితో మాట్లాడి ఆపరేషన్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– చరణ్, ఏఈ
కుక్క కరిస్తే ఇబ్బందులే...
సొల్లు కార్చే కుక్క కరిస్తే రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. కాటు వేసిన కొద్ది రోజులకే జ్వరం, తలనొప్పి, కండరాలు బిగుసుకుపోయి విపరీతంగా అలసటకు గురవుతారు. దీంతో సకాలంలో వైద్యం అందకపోతే కుక్కకాటుతో చనిపోయే ప్రమాదం సైతం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. నిత్యం కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

శునకాలతో భయంభయం

శునకాలతో భయంభయం