వేధిస్తున్నాడని భార్యనే హతమార్చింది ! | - | Sakshi
Sakshi News home page

వేధిస్తున్నాడని భార్యనే హతమార్చింది !

Jul 25 2025 4:46 AM | Updated on Jul 25 2025 4:46 AM

వేధిస్తున్నాడని భార్యనే హతమార్చింది !

వేధిస్తున్నాడని భార్యనే హతమార్చింది !

మల్యాల: రెండేళ్ల క్రితం.. మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. గుర్తు తెలియని వ్యక్తిని మెట్‌పల్లికి చెందిన సింగం నడిపి గంగాధర్‌(40)గా గుర్తించారు. మద్యానికి బానిసై నిత్యం వేధిస్తున్నాడని ఆయన భార్యే మరో నలుగురితో కలిసి హత్య చేసినట్లు నిర్ధారించారు. హత్యోదంతాన్ని నిందితులు వీడియో చిత్రీకరించారు. గంజాయి కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా ఈ విషయాలన్నీ వెలుగుచూశాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన సంబంధించిన వివరాలను డీఎస్పీ రఘుచందర్‌ స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం వెల్లడించారు.

ముత్యంపేట శివారులో 2023 మార్చి 14న గుర్తు తెలియని వ్యక్తి కాలిపోయి ఉన్నాడని అప్పటి వీఆర్‌ఏ అజీమొద్దీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 17న మెట్‌పల్లికి చెందిన సింగం గ్రాహిత్‌, అబ్దుల్‌ అప్సర్‌, చెన్న నిఖిల్‌ను మెట్‌పల్లి పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేశారు. వారి వద్దనున్న సెల్‌ఫోన్‌లు పరిశీలించగా.. హత్యకు సంబంధించిన వీడియో కనిపించింది. దీనిపై వారిని విచారించారు. మెట్‌పల్లికి చెందిన సింగం నడిపి గంగాధర్‌ మద్యానికి బానిసై నిత్యం భార్య సంధ్య, కుటుంబసభ్యులను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఇంట్లో వస్తువులు అమ్ముకుని జూదం ఆడేవాడు. నిత్యం మద్యం సేవించి వచ్చి హింసించేవాడు. పెద్ద కూతురు వివాహం చేసేందుకూ అడ్డుపడడంతో రూ.10వేలు ఇచ్చి ఒప్పించి.. బిడ్డ వివాహం చేశారు. కూతురి అత్తవారింటికి వెళ్లి అల్లుడితోనూ గొడవ పడేవాడు. ఈ విషయాన్ని సంధ్య గంగాధర్‌ అన్న కొడుకు గ్రాహిత్‌, తోటికోడలు మమతకు చెప్పింది. వారు గొడవ చేయవద్దని చెప్పినా గంగాధర్‌ వినిపించుకోలేదు. అతడిని చంపితేనే తాము సంతోషంగా ఉంటామని నిర్ణయించుకున్న సంధ్య.. గ్రాహిత్‌కు విషయం చెప్పింది. రూ.40వేలు ఇస్తే మరో ముగ్గురిని తీసుకొస్తానని అతడు చెప్పగా ఆ మొత్తం అందించింది. గ్రాహిత్‌ తన స్నేహితులైన అబ్దుల్‌ అప్సర్‌, పవన్‌ కలిసి గంగాధర్‌ను చంపేందుకు ఒప్పుకున్నారు. 2023 మార్చి 12న కారును అద్దెకు తీసుకుని సంధ్య, గ్రాహిత్‌, అబ్దుల్‌ అప్సర్‌, చెన్న నిఖిల్‌, పవన్‌, సింగం మమత కొండగట్టుకు వెళ్దామని చెప్పి గంగాధర్‌ను ఎక్కించుకుని ముత్యంపేట శివారు డంపింగ్‌యార్డు సమీపంలోకి చేరుకున్నారు. అక్కడ గంగాధర్‌కు మద్యం తాగించారు. సంధ్య, మమత గంగాధర్‌ కాళ్లు పట్టుకోగా.. గ్రాహిత్‌, అప్సర్‌ వైర్‌ను మెడకు చుట్టి ఊపిరాడకుండా చేశారు. నిఖిల్‌ ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తూ ఉన్నాడు. గంగాధర్‌ చనిపోయాడని నిర్ధారించుకుని శవాన్ని ఎవరూ గుర్తించకుండా చెత్తలో వేసి నిప్పంటించారు. ఈ హత్యోదంతాన్ని మొత్తం వీడియోతీశారు. అనంతరం మెట్‌పల్లి వెళ్లిపోయారు. మార్చి 14న గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గమనించి వీఆర్‌ఏ అజీమొద్దీన్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. గంజాయి కేసు విచారణలో సెల్‌ఫోన్‌లో హత్యకు సంబంధించిన వీడియో ఉండడంతో ఘటనలో ఆరుగురు పాల్గొన్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు. వీరిలో గ్రాహిత్‌, అబ్దుల్‌ అప్సర్‌, నిఖిల్‌ ఇప్పటికే గంజాయి కేసులో అరెస్టయి ఉన్నారు. పవన్‌ మరో కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. మమత మృతి చెందింది. ఏ–1 నిందితురాలైన సింగం సంధ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మిగిలిన వారిని కోర్టు అనుమతితో విచారించి, అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ నీలం, ఎస్సై నరేశ్‌కుమార్‌ ఉన్నారు.

గంజాయి కేసు విచారణతో హత్య కేసు వెలుగులోకి..

మద్యానికి బానిసై వేధిస్తున్నాడని ఐదుగురితో కలిసి అఘాయిత్యం

రెండేళ్ల క్రితం కొండగట్టులో దారుణం

హత్యోదంతం అంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ

గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసుగా నమోదు

నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement