
విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి
● ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా ఘటన
జగిత్యాలక్రైం: ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇరుగుదిండ్ల వంశీ (25) మంగళవారం సాయంత్రం బట్టలు ఆరేసేందుకు తన ఇంటిపైకి వెళ్లాడు. ఇంటిగోడపై బట్టలు ఆరేస్తుండగా పక్కనుంచే వెళ్తున్న 11 కేవీ వైర్లు తగలాయి. ఈ ఘటనలో వంశీ గోడ, విద్యుత్ వైర్లపై పడి ప్రాణాలు కోల్పోయాడు. రూరల్ ఎస్సై సదాకర్ మృతదేహాన్ని కిందకు దింపారు. ఇళ్లమధ్య నుంచి వెళ్తున్న వైర్లను తొలగించాలని కొన్నేళ్లుగా విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నాడు తండ్రి.. నేడు కొడుకు
వంశీ తండ్రి రాజు కూడా గతేడాది విద్యుత్‌షాక్‌తోనే చనిపోయాడు. గ్రామ శివారులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఆయన అక్కడ విద్యుత్ వైర్లకు తాగి మృతిచెందాడు. వంశీ ఇంటిపై బట్టలు ఆరవేస్తూ.. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. వంశీ తల్లి కేతమ్మ, సోదరుడు రాజ్‌కుమార్ కన్నీరుమున్నీరయ్యారు. ఏడాది వ్యవధిలోనే తండ్రీకొడుకులు విద్యుత్ షాక్‌తో మృతిచెందడంతో విషాదచాయలు అలుముకున్నాయి.
వనభోజనాలకని చెప్పి..
గడ్డిమందు తాగి..
ఎలిగేడు(పెద్దపల్లి): వన భోజనాలకు వెళ్దామని చెప్పిన అనగోని సుమన్ (38) మద్యం మత్తులో గడ్డిమందు తాగాడు. ఈవిషయాన్ని భార్యకు చెప్పడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన అనగోని సుమన్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 20న ఉదయం 11.30 గంటలకు చెట్ల తీర్థాలు (వనభోజనాల)కు వెళ్దామని ఇంట్లో చెప్పాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న అతడు.. ఆ మత్తులో గడ్డిమందు తాగాడు. ఇదే విషయాన్ని భార్య మమతకు చెప్పాడు. హఠాత్పరిణామానికి ఆందోళన చెందిన ఆమె.. ఆ వెంటనే తేరుకుని కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 21న రాత్రి మృతిచెందాడు.
మద్యానికి బానిసై..
జూలపల్లి(పెద్దపల్లి): వడ్కాపూర్ గ్రామానికి చెందిన అంగరి అభిలాష్(27) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సనత్‌కుమార్ కథనం ప్రకారం.. అభిలాష్ గ్రామంలోనే కూలీ పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. రోజు మద్యం తాగివచ్చి ఇంట్లో గొడవ పడుతున్నాడు. ఈక్రమంలోనే జీవితం విరక్తి చెందాడు. ఈనెలన గడ్డి మందుతాగి వాంతులు చేసుకున్నాడు. గమనించిన తండ్రి పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.

విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి