
పొలంలోనే పోయిన రైతు ప్రాణాలు
సారంగాపూర్: వరి నాటు వేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తుండగా ట్రాక్టర్ కేజివీల్స్, గొర్రు మధ్య ఇరుక్కుని రైతు దుర్మరణం పాలైన ఘటన బీర్‌పూర్ మండలం కొల్వాయిలో చోటుచేసుకుంది. స్థానికులు, ఏఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెట్ల గంగాధర్(38)కి రెండున్నర ఎకరాల పొలం ఉంది. దాంతోపాటు పొరుగు రైతుల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగుచేస్తున్నారు. అందులో నాటు వేసేందుకు 30 మంది మహిళలను పిలిచాడు. మహిళలు నారు తీస్తుండగా.. గంగాధర్ పొలాన్ని గొర్రు సహాయంతో సిద్ధం చేస్తున్నాడు. గొర్రు సమానం లేకపోవడంతో సరిచేసేందుకు కేజివీల్స్, గొర్రు మధ్యకు దిగాడు. మరోసారి సరిచూసుకునేందుకు ట్రాక్టర్ హైడ్రాలిక్‌ను పైకి లేపాడు. ఈ క్రమంలో గొర్రు చాలాపైకి లేవడంతో గంగాధర్ అందులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. దూరంలో ఉన్న గంగాధర్ తండ్రి ట్రాక్టర్ ఎందుకు ఆగిపోయిందని అక్కడి వచ్చి చూసేసరికి అప్పటికే గంగాధర్ మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గంగాధర్‌కు భార్య రమ, ఇద్దరు సంతానం. రమ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
గొర్రు, కేజివీల్స్ మధ్య ఇరుక్కుని రైతు దుర్మరణం

పొలంలోనే పోయిన రైతు ప్రాణాలు